మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్
అవనిగడ్డ: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి దళిత యువతిపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్ పేర్కొన్నారు. స్థానిక సీబీఎం బోర్డింగ్ స్కూల్ ప్రాంగణంలో దళిత నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ కొత్తపేటకు చెందిన ఎస్సీ యువతికి మోపిదేవికి చెందిన బీసీ యువకుడు కె. సందీప్ మాయ మాటలు చెప్పి మోపిదేవి మండల పరిధిలోని నాగాయతిప్ప రోడ్డులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అమానుషంగా దాడి చేసిన విషయంలో పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు. దాడికి గురైన బాధితురాలి స్టేట్మెంట్‌ను పోలీసులు తారుమారు చేసి కేసు నీరుగర్చారని దీనిపై పోలీసులు సరిగ్గా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేయకపోతే ఆందోళన చేస్తామని గోవర్ధన్ హెచ్చరించారు. దళిత నేతలు బట్టు జైపాల్, బత్తుల బిక్షం, జి. నాగశ్రీను, సీహెచ్ శ్యామ్, మద్దాల ధర్మారావు, సీహెచ్ రాకేష్, బొంతు ప్రకాష్, మేరుగు రణధీర్, గుంటూరు బాబూరావు, బెజవాడ రవి, గుంటూరు కుటుంబ రావు, లింగం అనీల్, మద్దాల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.


