ఇప్పటికే రెండుసార్లు విత్తనాలు వేశాం
అప్పు అయినా చేసి పంటను కాపాడుకుంటాం
పెడన: కృష్ణా డెల్టాలో రైతులకు సాగునీరు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వైఎస్సార్ సీపీ పెడన ఇన్‌చార్జ్ ఉప్పాల రాము చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ‘పెడన’లో చేపట్టిన రిలేదీక్షలు రెండో రోజు బస్టాండు ఎదురుగా ఆంజనేయస్వామి ఆలయం పక్కన చేశారు. తొలుత పార్టీ కార్యాలయం నుంచి దీక్షా శిబిరం వద్దకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా చేరుకున్నారు. దీక్షా శిబిరం వద్ద వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాము మాట్లాడుతూ ‘పెడన’లోని గూడూరులో 21వేల ఎకరాల్లో వరిసాగు అవుతుంటే ఇప్పటికే వెద పద్ధతిలో 14వేల ఎకరాలు వరకు సాగుచేస్తున్నారని, మరో 1500 ఎకరాలు నారుమళ్లు వేసి నాట్లు వేస్తున్నారని తెలిపారు. మరో ఆరువేల ఎకరాల వరకు సాగు మొదలు పెట్టలేదని గుర్తు చేశారు. పెడన మండలంలో 8వేల హెక్టార్లలో వరి సాగుఅవుతండగా 12వేల ఎకరాల్లో వెదసాగు చేస్తున్నారని, ఆరువేల వరకు నాట్లు వేయాల్సి ఉందని, 1500 ఎకరాలు వరకు నారు ఊడ్చారన్నారు. బంటుమిల్లి మండలంలో 15వేల ఎకరాలలో సాగు జరుగుతుండగా 10వేల ఎకరాలు వరకు వెద జల్లారని, ఐదు వేల ఎకరాలు నాట్లు వేయాల్సి ఉందన్నారు. కృత్తివెన్ను మండలంలో ఏడువేల ఎకరాల సాగుభూమి ఉందని, ఇందులో రెండు వేల ఎకరాల వరకు సాగు చేశారని, మరో ఐదువేల ఎకరాలు వరకు నాట్లు వేయాల్సి ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వెదజల్లిన పంటలకు, శివారు భూములకు నీరందని దుస్థితి నెలకొందన్నారు. మే నుంచి కూడా రైతులకు సబ్సిడీవిత్తనాలు అందజేస్తూ, ఏరువాక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పుడు సాగునీరు ఇవ్వలేమని చెప్పడం చాలా దారుణమన్నారు.
చరిత్రహీనుడిగా
స్థానిక ఎమ్మెల్యే నిలిచిపోతారు
2024లో తాను ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసి సాగునీటిని రెండు, మూడు దఫాలుగా విడుదల చేయించామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే.. సీఎం చంద్రబాబును బతిమాలి, ప్రాధేయపడి, బ్లాక్‌మెయిల్ అయినా చేసి సాగునీరు అందించేలా చూడాలని డిమాండ్ చేశారు. నీరు ఇవ్వకపోతే మాత్రం రైతుల గుండెల్ల చరిత్రహీనుడిగా నిలిచిపోతారన్నారు.
అవసరమైతే పాదయాత్ర
అవసరమైతే కృత్తివెన్ను మండలం పల్లెపాలెం నుంచి పామర్రు వరకు కూడా పాదయాత్ర చేస్తామని, ఇంకా ఇవ్వకపోతే ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా పాదయాత్ర చేసి రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. అప్పటికి కూడా నీరు ఇవ్వకపోతే మాత్రం రైతుల పక్షాన ఆమరణ నిరహార దీక్షకు కూడా వెనుకాడేది లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, పార్టీ రాష్ట్ర, జిల్లా, పెడన నియోజకవర్గ వివిధ అనుబంధ విభాగాల నాయకులు తిరుమాని శ్రీనివాసరావు, గరికపాటి వెంకటరామానాయుడు, కొండవీటి నాగబాబు, ఎంపీపీ రాజులపాటి వాణి, మార్కెట్ యార్డు మాజీ చైర్‌పర్సన్ గరికపాటి చారుమతి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బైలపాటి జ్యోతి, వన్నం శ్రీలత, రహెతున్నీసా, మైలారత్నకుమారి, కటకం ప్రసాద్, గరికిముక్కు చంద్రబాబు, జన్ను నాగమల్లేశ్వరరావు, సమ్మెట జయవర్ధన్, దావు బైరవలింగం, రాజులపాటి అచ్యుతరావు, గొరిపర్తి రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడనరూరల్, టౌన్‌లకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు పలువురు సంగా మధుసూధనరావు, ఎండీ ఖాజా, వేముల సురేష్‌రంగబాబు, రైతులు సంఘీభావం తెలిపారు. సాయంత్రం రైతులు నిమ్మరసం ఇవ్వడంతో రాము, హారిక, వైఎస్సార్ సీపీ కుటుంబశ్రేణులు దీక్షను విరమింపజేశారు.
సాగునీరు వస్తుందనే ఆశతో ఒకసారి వేసిన వెదసాగులో విత్తనాలు మొలకలు వచ్చి నీరందక చనిపోయాయి. మళ్లీ నీరువస్తుందని తెలిసి రెండో సారి విత్తనాలు వేశాం. నా ఒక్కడి పరిస్థితి కాదు. చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. ఇప్పుడు కూడా నీరందకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. – లోయ అంజి,
కొంగంచర్ల, పెడన మండలం
రైతు తన పంట చేతికి వచ్చేదాక కూడా ఎంతో కొంత అప్పుచేసి అయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడే పరిస్థితి ఉండదు. అధికారులు ఖర్చు ఎక్కువగా పెట్టవద్దని పేర్కొనడం రైతులకు మింగుడు పడటం లేదు. ఇప్పటికే ఇంజిన్లు ద్వారా నీటిని తోడి రైతు ఆర్థికంగా చితికిపోయాడు. ఇప్పుడు నీరివ్వలేమని చెప్పడం సరికాదు.
–యాదంరెడ్డి వరప్రసాద్,
ఉప్పలకలువగుంట, పెడన మండలం


