ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

Aug 8 2026 1:47 AM | Updated on Aug 8 2026 1:47 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మను శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆషాఢ మాసం సారె సంబరాల నేపథ్యంలో సారె సమర్పించిన భక్తుల సంఖ్య మాత్రం సాధారణంగానే కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మ వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన సమయానికి ఆలయ ప్రాంగణంలోని క్యూలు భక్తులతో కిటకిటలాడాయి. మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత అధికం కావడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏసీ రంగారావు గాలిగోపురం పాయింట్‌ వద్ద రద్దీని పర్యవేక్షించారు. శుక్రవారం కావడంతో ఉదయం నుంచి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవ, దర్బారు సేవల్లో ఉభయదాతలు పాల్గొన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో దేవదాయ శాఖ మంత్రి

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆలయాల అభివృద్ధికి, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ శీనానాయక్‌, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. పండితుల వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం దుర్గగుడిలో జరుగుతున్న మాస్టర్‌ ప్లాన్‌ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. 21వ తేదీ నూతన అన్నదాన భవనం, ప్రసాదాల పోటు భవనాల ప్రారంభోత్సవం నేపఽథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లు, టెండర్ల ప్రక్రియపై సమీక్ష చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

నవోదయ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు పెంపు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: బాపులపాడు మండలం వేలేరులోని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ జవహర్‌ నవోదయ విద్యాలయలో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే జేఎన్‌వీఎస్‌ టెస్ట్‌–2027కు దరఖాస్తు గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లుగా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సి.రాజశేఖర్‌ శుక్రవారం తెలిపారు. నవోదయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని రాజశేఖర్‌ పేర్కొన్నారు.

పుట్టిన ఊరిని మరవకూడదు

వీరులపాడు: జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పుట్టిన గ్రామాన్ని మరవకూడదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు. జమ్మవరంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో తల్లిదండ్రులు గణపతిరావు, సరోజినీదేవి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు వినియోగించుకుని శ్రద్ధగా చదువుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, ఎంఈవో పాల్‌ కెనడి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement