చదవలేక.. తండ్రికి చెప్పలేక
మధురానగర్(విజయవాడసెంట్రల్): చదువు ఒంటబట్టక.. ఈ విషయం తండ్రికి చెప్పలేక అర్ధంతరంగా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువుచాలించాడు. విషాద ఘటన శుక్రవారం విజయవాడ మధురానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన సమ్మెట దుర్గాప్రసాద్ ఎలక్ట్రీషియన్. ఆయన భార్య ఎనిమిది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించింది. కుమారుడు సమ్మెట తరుణ్ రాజ్ (13) సత్యనారాయణపురం ఏకేటీపీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజూలాగే శుక్రవారం ఉదయం 9.15కి స్కూల్‌కి వెళ్తున్నాను అని చెప్పి సైకిల్ మీద వెళ్లాడు. తర్వాత సుమారు 10 గంటల ప్రాంతంలో బయట నంబర్ నుంచి తండ్రికి ఫోన్ చేసి స్కూల్‌కు వెళ్లే సరికి గేటు వేసి ఉందని.. తాను ఇంటికి వచ్చేస్తున్నానని చెపాడు. దీంతో తండ్రి సరే వచ్చేసేయ్ అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు. పని ముగించుకుని దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపు లోపల వేసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా తరుణ్‌రాజ్ చున్నీతో ఫ్యాన్‌కి ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో దుర్గాప్రసాద్ చుట్టుపక్కల బంధువులను పిలిచి గుణదల పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెడ్రూంలోని ఒక పుస్తకంలో ‘నాన్నా నువ్వు చదువు .. చదువు అని ఎప్పుడూ అంటూ ఉంటావు. నాకు చదవడం అంతగా రావడం లేదు అందుకే చనిపోతున్నాను’ అని రాసి ఉంది. ఇప్పటికే భార్యను కోల్పోయిన దుర్గాప్రసాద్ ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు తనువు చాలించటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.


