ప్రశ్నలు.. చిక్కుముడులే! | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నలు.. చిక్కుముడులే!

Jul 7 2026 1:49 AM | Updated on Jul 7 2026 1:49 AM

ప్రశ్నలు.. చిక్కుముడులే! సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో కనిపించని పురోగతి

ఆధారాలు అంతంతమాత్రంగానే సేకరణ జిమ్‌ నిర్వాహకుడి తమ్ముడిని విచారించిన సిట్‌ గోవాకు తీసుకెళ్లిన ఫోన్‌ ఎవరిది? కేసులో అన్నీ అనుమానాలే చివరకు సాయికృష్ణ తల్లికి బూడిదైనా ఇస్తారా లేదా అనేదానిపై చర్చ

మొదటి నుంచీ హైడ్రామా..

సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో కనిపించని పురోగతి

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో రోజు రోజుకూ కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. శవాన్ని ఎవరు, ఎలా మాయం చేశారనే చిక్కుముడులు మాత్రం వీడటం లేదు. సిట్‌ బృందం ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేల్చే దిశగా అడుగులు వేయటం లేదు. మాజీ సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌లో కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో అనుమానాస్పద మరకలు ఉన్నట్లు గుర్తించినట్లు సిట్‌ పేర్కొంది. స్టేషన్‌ టెర్రస్‌పైన ఒక లాఠీ, ఎముకలు, కాలిన బూడిద స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. స్టేషన్‌లో పాక్షికంగా కాలిపోయిన స్టీల్‌ చేతి గొలుసు, ఇతర సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. ఇవి సాయికృష్ణవా? లేదా వేరే అనాథ శవానికి సంబంధించినవా అని తేలాలంటే ఫోరెన్సిక్‌ పరీక్షల ద్వారానే నిర్ధారణ కావాలి. అయితే కేసును తప్పుదోవ పట్టించేందుకు మాజీ సీఐ నాగరాజు గ్యాంగ్‌, ఎముకలు, బూడిద డ్రామాకు తెరలేపిందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ‘నాకు ప్రాణ హాని ఉంది’ అని మాజీ సీఐ న్యాయమూర్తికి లేఖ రాయడం వెనుక కూడా కుట్ర దాగి ఉందనే భావన వ్యక్తం అవుతోంది.

సీసీ ఫుటేజీ రికవరీ ఎప్పుడు?

సిట్‌ బృందం దాదాపు 20 రోజులుగా దర్యాప్తు చేస్తున్నా, కీలక అంశాలను వెలుగులోకి తీసుక రాలేక పోతోంది. ప్రధానంగా కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో మాయం అయిన సీసీ ఫుటేజీని రికవరీ చేస్తేనే కేసులో పురోగతి కనిపిస్తుంది. స్టేషన్‌లో సాయికృష్ణను ఎలా చిత్ర హింసలకు గురి చేసింది? శవాన్ని ఎలా మాయం చేసింది? తెలిసే అవకాశం ఉన్నా.. సీసీ ఫుటేజీ రికవరీ దిశగా మాత్రం అడుగులు పడటం లేదు. కేసు దర్యాప్తులో జాప్యం జరిగే కొద్దీ కీలక ఆధారాలు మాయం అయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సైతం పేర్కొంటున్నారు.

గోవాకు ఫోన్‌ ఎందుకో?

కేసును తప్పుదోవ పట్టించేందుకు కేసులో నిందితుడిగా ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌, సాయికృష్ణ ఫోన్‌ను గోవాకు ఏమైనా పంపించారా అనే దిశగా సిట్‌ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అశోక్‌కు సన్నిహితుడు జిమ్‌ నిర్వాహకుడైన సుశాంత్‌ను సిట్‌ బృందం పిలిపించి విచారించింది. సోమవారం జిమ్‌ నిర్వాహకుడి తమ్ముడైన ప్రదీప్‌ను సైతం పిలిచి, అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అశోక్‌ తనకు ఫోన్‌ ఇచ్చి పంపింది వాస్తవమేనని అంగీకరించినట్టు సమాచారం. ఫోన్‌ను గోవాకు పంపడం ద్వారా అక్కడికి సాయికృష్ణ వెళ్లినట్లు సాక్షాధారాలను సృష్టించే యత్నం చేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సురేష్‌ పాత్ర ఏంటి?

మాజీ సీఐకి సన్నిహితుడైన సురేష్‌ను సిట్‌ బృందం అదుపులోకి తీసుకున్నట్లు లీకులు మాత్రమే ఇస్తోంది. కాని ఇంకా అతని అరెస్టు మాత్రం చూపలేదు. కేసులో అతని పాత్ర ఏంటనేది, అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెడితేగాని తెలియదు. సురేష్‌ విషయంలో సిట్‌ గోప్యత పాటిస్తోంది. శవం మాయం వెనుక, మాజీ సీఐ నాగరాజు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు, సురేష్‌ ఏవిధమైన పాత్ర పోషించారనే దానిపైన, ఆధారాలు సేకరించడంపై సిట్‌ దృష్టి సారించింది. అయితే సాయికృష్ణ తల్లి మాత్రం ‘నా కొడుకు బతికుండాగానే పడుకోబెట్టి చేతులపైన మేకులు కొట్టి, లాఠీలతో కొట్టి, అతి దారుణంగా చంపారు. దేనికి చంపారు? ఇంతకు ముందుకు ఇంకెంత మందిని చంపారో? ఆఖరికి మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు’ అని మేజిస్టీరియల్‌ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘నా కొడుకును చంపిన కేసులో ఉన్న అందరూ బయటికి రావాలి. ఇంత వరకు నలుగురినో, ఐదుగురినో అరెస్టు చేశారు.. మిగతా వారేరి?’ అంటూ ప్రశ్నిస్తున్న సాయికృష్ణ తల్లికి సిట్‌ సమాధానాలు ఇవ్వలేక పోతోంది. ‘ఆ రోజు నా కొడుకును తీసుకెళ్లడానికి వచ్చినోళ్లు, ప్రతి ఒక్కరూ నాకు తెలుసు.. వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదు’ అని నిలదీస్తోంది. ఇలా కేసులో ఉన్న పలు అనుమానాలు నివృత్తి చేసి, చిక్కుమడులు వీడే దిశగా మాత్రం సిట్‌ బృందం దర్యాప్తు సాగడం లేదనే భావన అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

రోజుకో మలుపు తిరుగుతూ సాగుతున్న ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీసు, ప్రభుత్వ పెద్దల పాత్రపై సిట్‌ సరైన పద్ధతిలో దర్యాప్తు చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మొదట్లో కేసును బయటకు రాకుండా చేసిన వైనం.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చి నిలదీసే వరకూ ప్రభుత్వం స్పందించకపోవడం, ఆ తర్వాత సిట్‌ ఆధ్వర్యంలో సాగుతున్న విచారణ యావత్తూ.. కరకట్ట ప్యాలెస్‌ డైరెక్షన్‌లో నడుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సూత్రధారులు, పాత్ర ధారులను రక్షించే విధంగా పక్కా ప్లాన్‌తో సిట్‌ వ్యవహారిస్తోందని పోలీసు వర్గాలే పేర్కొంటున్నాయి. మాజీ సీఐ నాగరాజు, కానిస్టేబుళ్ల చుట్టే కేసును తిప్పుతోంది. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని దర్యాప్తును సాగదీస్తూ, కాలయాపన చేస్తోంది. రోజుకో హైడ్రామాతో కేసును రక్తి కట్టిస్తోంది. పక్కా ప్లాన్‌ ప్రకారమే కేసు నీరుగార్చే విధంగానే దర్యాప్తు సాగుతోంది. మొత్తం మీద సాయికృష్ణను ఎందుకు తెచ్చారో ఇంత వరకు సిట్‌ స్పష్టత ఇవ్వలేదు.

బూడిదైనా ఇస్తారా?

సాయికృష్ణను కృష్ణలంక పోలీసు స్టేషన్‌లోనే చిత్ర హింసలు పెట్టి, చంపినట్లు ఆధారాలు లభించినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. అయితే శవం ఏమైందనేది మాత్రం తేల్చలేక పోతోంది. చివరకు సాయికృష్ణ తల్లి వేడుకుంటున్నట్లు, కనీసం బూడిద ఇచ్చే దిశగా కూడా ప్రయత్నాలు చేయటం లేదనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement