సర్‌.. వేగవంతం కావాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌.. వేగవంతం కావాలి

Jul 7 2026 1:49 AM | Updated on Jul 7 2026 1:49 AM

సర్‌.. వేగవంతం కావాలి రేషన్‌షాపుపై విజిలెన్స్‌ దాడి కూచిపూడి నృత్యంలో ప్రాక్టికల్స్‌ ప్రారంభం సిద్ధార్థ వైద్య కళాశాలకు విరాళం

పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) సమర్థంగా, సకాలంలో పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. ఆయన సోమవారం పోరంకిలో 100 పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మునిసిపాలిటీ పరిధిలో ఉన్న బీఎవోలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. తాడిగడప మునిసిపాలిటీలో 125 పోలింగ్‌ కేంద్రాలలో 1,38,532 ఓట్లు ఉన్నాయన్నారు. అయితే డిజిటలైజేషన్‌ కేవలం 49 శాతమే అయిందని తెలిపారు. గత నెలలోనే సర్‌ ప్రారంభమయినా మ్యాపింగ్‌లో చాలా వెనుకబడి ఉన్నారన్నారు. ప్రతీ బీఎల్‌వో, అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా, లోపాలు లేకుండా చేయాలని ఆదేశించారు. సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో కరుణకుమారి, తాడిగడప మునిసిపల్‌ కమిషనర్‌ షేక్‌ నజీర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పెడన: మండల పరిధిలోని కొంకేపూడి పంచాయతీ ఈదుమూడి గ్రామంలో సోమవారం రేషన్‌షాపుపై విజిలెన్స్‌ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ ఏడీ వి. కిరణ్‌బాబు ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. స్టాక్‌ రిజిస్టర్‌ను, ఉన్న సరుకు నిల్వలను పరిశీలించారు. ఈ–పోస్‌ యంత్రంలో పంపిణీ చేసిన బియ్యం 1,312 కిలోలుండగా నిల్వలు 1,550 కిలోలున్నట్లుగా గుర్తించి 238 కేజీలు బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే పంచదార అర కిలో ప్యాకెట్లు ఈ–పోస్‌ ద్వారా 16 ప్యాకెట్లు పంపిణీ చేసినట్లుగా ఉండగా నిల్వ 15 ప్యాకెట్లు ఉండటాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా డీలర్‌ పి. రాజేశ్వరమ్మపై 6ఏ కేసు నమోదు చేసి రేషన్‌షాపును వీఆర్వో మౌలాలికి అప్పగించారు.

పామర్రు: మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం శ్రీసిద్ధేంధ్ర యోగి కూచిపూడి కళాపీఠంలో సర్టిఫికెట్‌ కోర్సు ఆఫ్‌ కూచిపూడి డ్యాన్స్‌ ప్రాయోగిక పరీక్షలను సోమవారం ప్రారంభించారు. ఈ సర్టిఫికెట్‌ పరీక్షలు ఐదు రోజుల పాటు జరుగుతాయని.. వీటికి అబ్జర్వర్‌గా డాక్టరు ఉషా మాధవి, చీఫ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ చింతా రవి బాలకృష్ణ వ్యవహరించారని వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చింతా రవి బాలకృష్ణ తెలిపారు. మృదంగ సహకారం పసుమర్తి హరినాథ్‌ శాస్త్రి అందిచారన్నారు. సర్టిఫికెట్‌ ప్రాయోగిక పరీక్షల అనంతరం ఆరో రోజు డిప్లొమా ప్రాయోగిక పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యలో జనరల్‌ మెడిసిన్‌ సబ్జెక్ట్‌లో ప్రతిభ చూపిన వారికి గోల్డ్‌మెడల్‌ అందించేందుకు ఫార్మకాలేజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయకుమారి విరాళం అందజేశారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని సోమవారం సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావుకు అందజేశారు. ఈ విరాళం ద్వారా ఏటా జనరల్‌ మెడిసిన్‌లో ప్రత్యేక పరీక్ష నిర్వహించి, అందులో ప్రతిభ చూపిన వారికి గోల్డ్‌మెడల్‌ అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏడుకొండలరావు మాట్లాడుతూ విద్యార్థులను చదువులో ప్రోత్సహించేలా గోల్డ్‌మెడల్‌ విరాళం ఇచ్చిన డాక్టర్‌ విజయకుమారిని అభినందించారు. ఈ మెడల్‌ వందలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement