పవన్‌కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

పవన్‌కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు

Jul 7 2026 1:49 AM | Updated on Jul 7 2026 1:49 AM

గన్నవరం: తన కుమార్తె సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకుని లబ్ధి పొంది, ఆ తర్వాత ఈ కేసులో ఆధారాలు లేవని చెబుతున్న డెప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ ప్రీతి తల్లి పార్వతీదేవి కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో తన భర్త సుగాలి రాజు నాయక్‌తో కలిసి పార్వతీదేవి ఎస్‌ఐ ప్రశాంతికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్వతీదేవి మాట్లాడుతూ.. గతంలో అనేక సభల్లో సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని, పైగా సుగాలి ప్రీతి కేసులో అసలు ఆధారాలే లేవని ఆయన అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసులో నిందితులకు క్లీన్‌ చిట్‌ ఇచ్చేలా పవన్‌ మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. యూ ట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని కేసు పెట్టారని, తన కుమార్తె కేసుపై తప్పుడు ప్రచారం చేసిన పవన్‌ కల్యాణ్‌పై కూడా కేసు నమోదు చేసి, చట్టం ముందు అందరూ సమానులేనని నిరూపించాలని కోరారు. తన ఫిర్యాదును స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ స్వీకరించారని ఆమె తెలిపారు. పార్వతీదేవికి వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్‌రాజు సంఘీభావం తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement