పాయకాపురం(విజయవాడరూరల్): నగర శివారు ఎల్బీఎస్ నగర్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య మునిసిపల్ హైస్కూల్లో క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను పీఈటీ ఉపాధ్యాయుడు చితక బాదాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. సుమారు 20 మంది విద్యార్థులను కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పీఈటీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆరో తరగతి చదువుతున్న షేక్ నగీన, యోబుతో పాటు మరికొందరు విద్యార్థులు ఇంటర్వెల్ సమయం మించిపోయినా తరగతులకు వెళ్లకుండా బయట ఉన్నారనే కారణంతో ఆగ్రహంచిన పీఈటీ ఉపాధ్యాయుడు రవీంద్రరెడ్డి బెత్తంతో చితకబాదారు. ఈ విషయాన్ని విద్యార్థులు ఏడుస్తూ తమ తల్లిదండ్రులకు తెలిపారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న డీవైఈఓ సాంబశివరావు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, విద్యార్థుల తల్లిదండ్రులకు సర్దిచెప్పారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, మైలవరం నియోజకవర్గ విద్యార్థి విభాగం ప్రెసిడెంటు ఎం.సురేష్ పాఠశాల వద్దకు వచ్చి విద్యార్థులను పరామర్శించారు. పీటీ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడు రవీంద్రరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


