ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అన్నదానం, ఉచిత ప్రసాద వితరణకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు సోమవారం రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ కాప్రాకు చెందిన అదృష్టార్ రత్నాలయం జూయాలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని గుడివాడ రమణలాల్ అన్నదానం నిమిత్తం రూ.1,00,016ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. రుచర్మ పేరిట ఉచిత ప్రసాద వితరణకు రూ.1,00,016 విరాళాన్ని అందించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
నందివాడ: మండలంలోని పోలుకొండ గ్రామంలోని దుర్గా వైన్ షాప్‌లో పనిచేస్తున్న సిబ్బంది మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సోమవారం వైన్ షాప్‌కు తాళాలు వేసి నిరసన చేపట్టారు. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తమకు మూడు నెలలుగా ఎటువంటి జీతాలు చెల్లించకుండా, మద్యం సిండికేట్‌దారులు తమతో పని చేయించుకుంటున్నారన్నారు. జీతాలు అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెబుతూ మాట దాట వేస్తున్నారని. ఒక్కొక్కరికీ రూ.80 వేల వరకు జీతాలు రావాలని మద్యం సిండికేట్ దారులు జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో మద్యం సిండికేట్ గడువు ముగిస్తుండడంతో జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని తమకు రావాల్సిన బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. షాప్ యాజమాన్యాన్ని పలుమార్లు అడిగినా స్పందించలేదని వారు ఆరోపించారు. జీతాలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని సిబ్బంది చెప్పారు.
కోనేరుసెంటర్: తాళాలు వేసి ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన మచిలీపట్నంలో సోమవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇనగుదురుపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం ముస్తాన్‌ఖాన్‌పేటకు చెందిన పుప్పాల వెంకటరామ్ పాత ఇనుము వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల ఒకటో తేదీన తన తల్లికి ఆరోగ్యం క్షీణించటంతో వైద్యం నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేర్పించి కుటుంబంతో సహా అక్కడే ఉంటున్నారు.
కేసు నమోదు.. దర్యాప్తు
ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు వేసి ఉన్న తలుపులను బద్దలుకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న సుమారు నాలుగు లక్షల నగదు, ఆరు కాసుల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండిని అపహరించారు. సోమవారం ఉదయం తలుపులు తీసి ఉండటాన్ని గమనించిన స్థానికులు మంగళగిరిలో ఉన్న వెంకటరామ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. మచిలీపట్నం చేరుకున్న అతను ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని నగదు, వస్తువులు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించి ఇనగుదురుపేట పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న ఇనగుదురుపేట సీఐ పరమేశ్వరరావు, ఎస్‌ఐ బేగ్, సీసీఎస్ ఎస్‌ఐ నాగరాజు తదితరులు హుటాహుటినా సంఘటనా స్థలానికి వచ్చారు. క్లూస్‌టీం సిబ్బంది నిందితుల వేలిముద్రలు సేకరించి, డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరమేశ్వరరావు తెలిపారు.
పటమట(విజయవాడతూర్పు): భవనంపై నుంచి దూకి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటమట గురునానక్‌రోడ్డు టీచర్స్ కాలనీ రోడ్ నం–1 వద్ద ఉన్న కోనేరు కోటేశ్వరరావు ఐకాన్ వద్ద విజయనగరం జిల్లా తిక్కవరపు కోట మండలం పోతంవేట గ్రామానికి చెందిన గొల్ల సోమేశ్వరరావు సోమవారం ఉదయం భవనంపై నుంచి దూకి చనిపోయాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమేశ్వరరావు మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


