మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఈ నెల 24, 25, 26 తేదీల్లో గుంటూరులో జరుగనున్న రాష్ట్ర స్థాయి రోల్‌బాల్ స్కేటింగ్ పోటీలకు తమ క్లబ్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఎంపిక అయ్యారని ఉదయ్ స్కేటింగ్ క్లబ్ కోచ్ కె.ఉదయ్‌భాస్కర్ చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను అజిత్‌సింగ్‌నగర్‌లోని క్లబ్ ఆవరణలో సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కంకిపాడులోని క్యాపిటల్ స్పోర్ట్స్ కార్నర్‌లో ఆదివారం ఈ ఎంపిక ప్రక్రియ జరిగిందన్నారు. ఈ పోటీల్లో బాలికల అండర్–11 టీమ్ విభాగంలో కె.ప్రద్వీక, జి.షైనీ, సీహెచ్.అనూహ్య, ఎస్.యోచన, ఎం.పర్ణిత, ఎస్.కృతిక, అండర్–14 టీమ్ విభాగంలో కె.ఆద్విక, ఈ.ఏమిమా, సీనియర్స్ విభాగంలో కె.పూజ, కె.సంకల్ప ఎంపికయ్యారని తెలిపారు. అండర్–11 బాలుర విభాగంలో టి.టింకి, హిమంత్, ఎం.జయకర్, అండర్–14 విభాగంలో అబ్దుల్ సలామ్ ఎంపికయ్యారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు అక్కడ కూడా విజయం సాధించాలని ఉదయ్‌భాస్కర్ ఆకాంక్షించారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవమైంది. ధర్మ ప్రచార సభ రాష్ట్ర కార్యకర్తల సమావేశం దై వార్షిక ఎన్నికలు ఆదివారం విజయవాడలో జరిగాయి. 2026–28 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా కొల్లి సీతారామ గురుస్వామి, కార్యదర్శిగా జి.జయచంద్ర, కోశాధికారిగా సీహెచ్ నాగార్జున రాజు, జోనల్ ఉపాధ్యక్షులుగా గురునాథ్, వీరాస్వామి, జోనల్ కార్యదర్శులుగా రావి రవికుమార్, జె.రామమూర్తి, వలంటీర్ కమాండర్‌గా ప్రభాకర్, ప్రజా సంబంధ అధికారిగా రవికుమార్‌లతో పాటు అన్ని జిల్లాల నుండి నూతన రాష్ట్ర కార్య వర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప దాస్, ఎన్నికల అబ్జర్వర్‌గా జాతీయ కార్యదర్శి బి.హరిప్రసాద్ వ్యవహరించారు. అనంతరం పాత కార్యవర్గం సభ్యులను సత్కరించి నూతన కార్యవర్గం చేత ప్రమాణస్వీకారం చేయించి నియామక పత్రం అందజేశారు. ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు శంకరాచార్యులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌరవ అతిథులుగా అయ్యప్ప స్వామి దేవాలయ నంబూద్రిలు బ్రహ్మశ్రీ హరిహరన్ నంబూద్రి, గొల్లపూడి దేవస్థాన ప్రధాన అర్చకుడు శ్రీకాంత్ నంబూద్రి, మధుసూదనన్ నంబూద్రి, కుమారన్ నంబూద్రి జంధ్యాల రామకృష్ణ అన్నదేవర రామకృష్ణ గురుస్వామి పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి దీక్ష, ఇరుముడి కట్టు, పవన పడునెట్టమబడి ప్రాధాన్యత, గురుస్వామి బాధ్యత, శబరిమల ఆచార వ్యవహరాలు గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రత్యేక పర్యవేక్షకులు ఏబీఏపీ ట్రస్ట్ సభ్యులు లంకబాబు తదితరులు పాల్గొన్నారు.
కోనేరుసెంటర్: సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అనేక నేరాలకు పాల్పడుతున్న ఓ రౌడీషీటర్‌పై జిల్లా పోలీసులు పీడియాక్ట్ అమలు చేశారు. మచిలీపట్నం సుకర్లాబాదుకు చెందిన సాలా సుబ్రహ్మణ్యం అలియాస్ బుడ్డి అనే యువకుడు నగరంలో అనేక నేరాలు చేస్తూ పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. అతనిపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో సుమారు 14కుపైగా క్రిమినల్ కేసులో పాటు రౌడీషీట్ ఉంది. అయినప్పటికీ సుబ్రహ్మణ్యంలో ఎటువంటి మార్పు రాకపోగా యథావిధిగా నేరాలకు పాల్పడుతున్నాడు. దీంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసేందుకు అనుమతులు కోరుతూ జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు లేఖ రాశారు. సుబ్రహ్మణ్యం నేరచరిత్ర పూర్తి తెలుసుకున్న కలెక్టర్ అతనిపై పీడీ యాక్ట్ అమలుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సుబ్రహ్మణ్యంను చిలకలపూడి పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. జిల్లాలో ఎవరైనా ప్రజల శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తూ ప్రవర్తించినా, అనుచితంగా వ్యవహరించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే నేరచరిత్ర కలిగిన వ్యక్తులు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉన్నా తక్షణమే తమకు సమాచారం అందించాలని కోరారు.


