పొలం కొనుగోలు విషయంలో వివాదం ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు పోలీసులు న్యాయం చేయడం లేదంటూ తీవ్ర మనస్తాపం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): పొలం కొనుగోలు విషయంలో పోలీసులు తనకు న్యాయం చేయటంలేదంటూ ఓ వ్యక్తి మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కథనం మేరకు.. నాగాయలంక మండలం పర్రచివర గ్రామానికి చెందిన చిక్కాల సురేష్‌బాబు కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన రైతు వద్ద ఎకరం పొలం కొనుగోలు నిమిత్తం రూ.15 లక్షలను పొలం యజమానికి అందజేశాడు. అయితే సదరు పొలం యజమాని సురేష్‌బాబుకు కొనుగోలు విషయంలో తాత్సారం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ విషయంలో పొలం యజమానికి సురేష్‌బాబుకు మధ్య అనేకమార్లు వివాదం జరిగింది. బాధితుడు సురేష్ ఈ విషయంపై న్యాయం కోరుతూ అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోలేదు.
సర్వజన ఆస్పత్రిలో చికిత్స..
ఇటీవల మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న పొలం తాలూకు మధ్యవర్తి అయిన తాడేపల్లి శ్రీనివాసరావును కలిసి తన డబ్బులు తనకు ఇప్పించాలని లేదంటే పొలం అయినా ఇప్పించాలని సురేష్ డిమాండ్ చేయగా ఈ విషయంలో ఇరువురి మద్య ఘర్షణ చోటుచేసుకోగా శ్రీనివాసరావు బాధితుడిపై దాడి చేశాడు. అదే రోజు సురేష్ ఇనగుదురుపేట పోలీసులకు శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశాడు. అయినా న్యాయం జరగకపోవటంతో మనస్తాపం చెందిన సురేష్ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీ పెట్టి న్యాయం కోరేందుకు మచిలీపట్నం వచ్చాడు. ఎస్పీ కార్యాలయానికి సమీపంలో బండి పార్కింగ్ చేశాడు. కార్యాలయం గేటు వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చిన సురేష్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా భార్య సుధారాణి అడ్డుకుంది. అప్పటికే సురేష్‌బాబు కొంత మేర డబ్బాలో మందు తాగేయటంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటినా మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సురేష్‌బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి భార్య సుధారాణి తమ కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది.


