మచిలీపట్నంఅర్బన్: విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సమరం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల డిమాండ్ల సాధన కోసం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టారు. ధర్నా అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరగా, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం కొందరు నాయకులు, విద్యార్థులను మాత్రమే కలెక్టరేట్‌లోకి అనుమతించగా, ఆర్డీఓ పోతురాజుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
హామీలను అమలు చేయకుండా
కాలయాపన..
ఈ సందర్భంగా సమరం మాట్లాడుతూ.. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంతో వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో మెస్ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందడం లేదన్నారు. మెస్ చార్జీలను రూ.3 వేల మేర పెంచడంతో పాటు కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిరాకరిస్తున్న జీవో నెం.77ను తక్షణమే రద్దు చేయాలని, డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. విద్యార్థులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే పోలీసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.హారిక, జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్ర, జిల్లా సహాయ కార్యదర్శి ఎండీ అమీర్, నాయకులు విజయ్, సాయినాథ్, ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులు, డిగ్రీ కళాశాల విద్యార్థులు గౌస్ మహమ్మద్, జగదీష్, పి.తారక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


