బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్‌

Jul 7 2026 1:49 AM | Updated on Jul 7 2026 1:49 AM

కంకిపాడు: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, ప్రలోభాలకు గురిచేసి మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో నిందితుడిని కంకిపాడు పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. గన్నవరం ఇన్‌చార్జి డీఎస్పీ కె.ధర్మేంద్ర స్థానిక పోలీసుస్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నిందితుడి అరెస్టు వివరాలను మీడియా సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ పెనమలూరు మండలం గోసాల ఈదులడొంకకు చెందిన బాలిక (14) కంకిపాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కంకిపాడు భద్రాచలం వీధికి చెందిన ప్రొద్దుటూరి ఆనంద్‌(25) బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. గత నెల 16న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనను చూసి అనుమానించిన తల్లి నిలదీయటంతో బాలిక జరిగిన విషయాన్ని తల్లితో చెప్పింది. దీంతో ఈనెల 2న బాలిక తల్లి కంకిపాడు పోలీసులను ఆశ్రయించింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్టుల కింద కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు సూచనలతో ఇన్‌చార్జి డీఎస్పీ ధర్మేంద్ర, ఎస్‌ఐ కేవై దాసు ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టారు. ప్రొద్దుటూరు గాయత్రీ విహార్‌లోని విద్యుత్‌ ఆఫీస్‌ వద్ద నిందితుడు ఆనంద్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు.

ప్రలోభాలకు లొంగొద్దు..

మాయమాటలకు, ప్రలోభాలకు మైనర్లు, యువత మోసపోవద్దని, లొంగొద్దని ఇన్‌చార్జి డీఎస్పీ ధర్మేంద్ర సూచించారు. సోషల్‌ మీడియా, ఫోన్‌ వినియోగం పెరగటంతో చిన్నారులు, యువత దారి తప్పుతున్నారన్నారు. టెక్నాలజీతో వస్తున్న మార్పులను అందరూ గమనించాలని, ప్రత్యేకించి విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ, సన్మార్గంలో నడిచేలా చూడాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement