రక్షణ కల్పించాల్సిన వారే ప్రాణాలు తీస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

రక్షణ కల్పించాల్సిన వారే ప్రాణాలు తీస్తున్నారు

Jul 7 2026 1:49 AM | Updated on Jul 7 2026 1:49 AM

రక్షణ కల్పించాల్సిన వారే ప్రాణాలు తీస్తున్నారు

లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో శాంతిభద్రతలు కాపాడుతూ, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే వేధించి, వేంటాడి ప్రాణాలు పోయేలా చేయడం దుర్మార్గమని బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ అన్నారు. కృష్ణలంక సీఐగా పనిచేసిన నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్‌ కుటుంబ సభ్యులను సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన బహుజన చైతన్య వేదిక సభ్యులు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మే 21న, అంతకు ముందు జరిగిన పరిణామాలను తండ్రి వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు.

డీసీపీకి వినతిపత్రం అందజేత..

అనంతరం శివరామకృష్ణ మాట్లాడుతూ సీఐ నాగరాజు తన స్వప్రయోజనాల కోసం యువకులను పలు విధానాలుగా ఉపయోగించుకుంటూ, మాట వినని వారిపై నేరాలు మోపి రకరకాలుగా చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తుందన్నారు. యువకులపై రౌడీషీట్లు ఓపెన్‌ చేసి మరో కోణంలో తన దందాలు నడిపారని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం క్రాంతికుమార్‌ ఘటనలో సీఐ నాగరాజు, ఇతర సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. క్రాంతికుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఆ సంఘ ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు, ప్రతినిధులు రామాంజనేయులు, రామాంజినప్ప, కుళ్లాయప్ప, చల్లపల్లి ఈశ్వర్‌, పరిగి గోవిందప్ప, పరిగి మద్దిలేటి, ఊట్కూర్‌ మూర్తి తదితరులు ఉన్నారు. అనంతరం ఈస్ట్‌జోన్‌ డీసీపీ కృష్ణకాంత్‌ పటేల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement