కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో తన దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్నింటిని వెంటనే పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌లను ఆశ్రయించే బాధితులకు సిబ్బంది అండగా నిలవాలన్నారు. అర్జీలను నిశితంగా పరిశీలించి చట్టపరిధిలో విచారణ జరిపించి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. అలాగే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అమర్యాదగా మాట్లాడితే శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. బాధతో వచ్చిన బాధితులు సంతోషంగా వెళ్లేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో 50 ఫిర్యాదులు అందుకున్నట్లు ఎస్పీ తెలిపారు.


