తవ్వకాలు ఆపాలని ఇప్పటికే హెచ్చరించాం
వాగు భూములపై కన్ను ఆక్రమణలో పోరంబోకు భూములు చేపల చెరువులు, సాగుభూమిగా మార్పు కబ్జాదారుల చెరలో 10 ఎకరాల పైనే వాటి విలువ సుమారు రూ.2 కోట్లు
చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లి మండల పరిధిలోని చిల్లలవాగు పోరంబోకు భూములపై కూటమి గద్దల కన్ను పడింది. వైఎస్సార్ సీపీ హయాంలో గప్‌చుప్‌గా ఉన్న కబ్జాదారులు చంద్రబాబు పాలనలో రెచ్చిపోతున్నారు. చల్లపల్లి మండలం, పాగోలు పంచాయతీ శివారు లంకతోట వద్ద చిల్లలవాగు మేజర్ డ్రెయిన్ పోరంబోకు భూములను ఆక్రమణదారులు తవ్వేస్తున్నారు.
ఆక్రమణదారుల పాగా
చిల్లలవాగు డ్రెయినేజీ కుడివైపున పోరంబోకు భూముల్లో కబ్జానేతలు పాగా వేశారు. ఆ ప్రాంతానికి హద్దులు నిర్ణయించి చేపల చెరువుల తవ్వకం మొదలుపెట్టారు. లంకతోట రోడ్డును ఆనుకుని చెట్లతో ఉన్న పోరంబోకు భూముల్లో సుమారు 10 ఎకరాలకుపైగా ఆక్రమించుకుని గుట్టు చప్పుడు కాకుండా చేపల చెరువులు, సాగు భూములుగా మార్చేస్తున్నారు.
ఆక్రమిత భూమి విలువ రూ.2కోట్లు పైమాటే!
ఈ ప్రాంతంలో ఎకరం పొలం మార్కెట్ ధర రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ ఉంది. ఈ లెక్కన ఆక్రమణల చెరలో చేపల చెరువులుగా మారుతున్న పోరంబోకు భూముల ధరల విలువ సుమారుగా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.
నరికివేతకు గురవుతున్న వృక్ష సంపద
చేపల చెరువులు తవ్వడం కోసం పోరంబోకు భూమిలో గట్ల వెంట ఉన్న సుమారు 30 నుంచి 40 వరకూ చెట్లను ఎటువంటి అనుమతులు లేకుండానే నిలువునా నరికేశారు. గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకున్నారు.
2014–2018లో భారీగా కబ్జాలు
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 2014–18 మధ్య కాలంలో కూడా ఈ కబ్జా బాబులు చిల్లలవాగులో పోరంబోకు భూములను అందినకాడికి కబ్జాచేసి చెరువులుగా, పొలాలుగా మార్చుకుని సాగుచేసుకున్నారు. 2019–24 మధ్య వైఎస్సార్ సీపీ గవర్నమెంటు ఉండటంతో కబ్జాదారులు ఆటలు సాగలేదు. తాజాగా మళ్లీ మొదలయ్యాయి.
అధికారుల తీరుపై విమర్శలు
ఇంత తవ్వుతున్నా మైనింగ్ అధికారులుగానీ, డ్రెయినేజీ, రెవెన్యూ అధికారులుగానీ అటువైపు కన్నెత్తి చూడకపోవటంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ముఖ్య అనుచరులు కావడంతో అధికారులు ఎవరూ ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవటానికి భయపడుతున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తుకు ముప్పు
డ్రైనేజీ పోరంబోకు భూములను ఆక్రమించి చెరువులుగా మార్చడంతో వర్షాకాలం వరద నీరు వెళ్లే మార్గం మూసుకుపోతుంది. గ్రామాలు, పంటపొలాలు, ముంపునకు గురవుతాయి. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఉన్నత స్థాయి విచారణ చేయాలి
ఆక్రమణకు గురై చెరువులుగా మారుతున్న పోరంబోకు భూములపై విచారణ జరపాలని పలు ప్రజాసంఘాల నేతలు, ప్రజలు కోరుతున్నారు. అనుమతులు లేకుండా చెట్లను నరికిన వారిపై, భూమిని ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పోరంబోకు భూముల్లో
తవ్వుతున్న పొక్లెయిన్
డ్రెయిన్లలో ఎక్కడైనా మట్టి తవ్వితే కఠిన చర్యలు తీసుకంటాం. కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం. చిల్లలవాగు పక్కనున్న పోరంబోకు భూమిలో చెరువులు తవ్వుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. అక్కడ తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించాం. లెక్కచేయకుండా ఇంకా తవ్వితే చర్యలు తప్పవు. త్వరలోనే ఆప్రాంతంలో చిల్లలవాగు కింద పోరంబోకు భూములు ఎంతవరకూ ఉన్నాయనే దానిపై పూర్తి సర్వే చేయిస్తాం.
– చిరంజీవి, ఏఈ, డ్రెయినేజీ శాఖ, చల్లపల్లి
సాధారణంగా ప్రభుత్వ భూమిలో గంపెడు మట్టి తీయాలన్నా ఎన్నో అనుమతులు కావాలి. ఇక్కడైతే సీన్ రివర్స్. పది రోజుల నుంచి భారీ పొక్లెయిన్ సాయంతో రాత్రనకా.. పగలనకా తేడా లేకుండా తవ్వుకుపోతున్నారు. డ్రెయిన్‌కు పక్కనున్న ప్రాంతంలో చెరువులు తవ్వి పంట పొలాలవైపు ఉన్న పోరంబోకు భూమిని సాగు భూమిగా సిద్ధం చేస్తున్నారు. అయితే రెండు రోజుల నుంచి కేవలం రాత్రిళ్లకే పరిమితం చేశారు. ఎక్కువగా ఉన్న మట్టిని ట్రాక్టర్లలో తరలించి అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు.


