జీతం రాక.. జీవితం సాగక | - | Sakshi
Sakshi News home page

జీతం రాక.. జీవితం సాగక

Jun 12 2026 7:31 AM | Updated on Jun 12 2026 7:31 AM

జీతం రాక.. జీవితం సాగక ప్రాణాలు కాపాడుతున్న చేతులకు జీతాల కష్టాలు

కాంట్రాక్టు వైద్య ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాల్లేవ్‌.. జీజీహెచ్‌, ఎస్‌ఎంసీలో 400మంది వరకూ ఉన్న వైనం

అసలు ఏమి జరిగిందంటే..

ప్రాణాలు కాపాడుతున్న చేతులకు జీతాల కష్టాలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. ప్రభుత్వ మొండి వైఖరితో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు చెల్లించకపోవడంపై అధికారులను అడుగుతుంటే వారు ఏవేవో కారణాలు చెబుతున్నా రని, గట్టిగా అడిగితే తమ చేతుల్లో ఏమీ లేదంటున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకనెలలో నాలుగు రోజులు జీతం ఆలస్యమేతేనే ఇబ్బందని, అలాంటిది మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి జీతాలు రావడం లేదని మేమేం అవస్థలు పడుతున్నామో అధికారులకు ఏం తెలుసని పలువురు వాపోతున్నారు.

400మంది కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు

విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్‌), ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల (ఎస్‌ఎంసీ) పరిధిలో సుమారు 400 మంది కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు పనిచేస్తున్నారు.

వారిలో 250 మంది వరకూ స్టాఫ్‌ నర్సులు ఉండగా, మిగిలిన వారు ఆఫీసు సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పారా మెడికల్‌ సిబ్బంది, టెక్నీషియన్లు, అడ్మినిస్ట్రేటర్లు ఇలా అనేక విభాగాల్లో పని చేస్తున్నారు. వీరిలో కొందరు పదేళ్లకు పైగా పనిచేస్తుండగా, మరికొందరు ఐదేళ్లుగా పని చేస్తున్నారు.

అప్పులు చేయాల్సిన పరిస్థితి

మూడు నెలలుగా జీతాలు రాక పోవడంతో అప్పులు చేసి, కుటుంబాలను నెట్టుకు రావాల్సి వస్తోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రతినెలా మొదటి వారంలో జీతాలు వస్తుండేవని, దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం, వస్తువులు కొనుగోలు చేయడం చేశామంటున్నారు. ఇప్పుడు వాటి ఈఎంఐలు చెల్లించేందుకు బంగారు వస్తువులు తాకట్టు పెట్టాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాటవేత ధోరణి

కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల జీతాల విషయమై ప్రభుత్వాస్పత్రి అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జయలక్ష్మిని వివరణ కోరగా, ఉద్యోగుల జీతాలు వంటి విషయాలు అన్నీ వైద్య కళాశాల ఏడీ చూస్తున్నట్లు తెలిపారు. వైద్య కళాశాల ఏడీని సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేసి తాము కొత్తగా వచ్చామని, అవి తమకు తెలియదని చెప్పడం గమనార్హం

ఇప్పటి వరకూ ఉద్యోగులకు సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి ప్రభుత్వం జీతాలు చెల్లించేది. ప్రస్తుతం నిధి పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం ఎప్పుడు జరిగింది.. వారి వివరాలు అన్నీ ఎంటర్‌ చేయాలి. తక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్న చోట ఒకటీ, రెండు నెలల్లో చేసేశారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న వైద్యశాఖలో నిధి పోర్టల్‌లో డేటా ఎంటర్‌ చేయడం జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement