ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ సామూహిక అక్షరాభ్యాసాలు జరగనున్నాయి. దీనిపై ఆలయ వైదిక కమిటీ సామూహిక అక్షరాభ్యాసాల నిర్వహణకు నిర్ణయించింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరో అంతస్తులో బుధవారం ఉదయం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సుమారు 250 మందితో అక్షరాభ్యాసం చేయించనున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
పెనమలూరు: జాతీయ స్థాయిలో జరగనున్న ఫెడరేషన్ కప్ బాడీ బిల్డింగ్ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులను ఎంపిక చేశామని ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. ఆయన గురువారం కానూరులో వివరాలు తెలుపుతూ సయ్యద్ జావీద్(57కేజీలు), దుంప వంశీ(75కేజీలు) విభాగంలో ఏపీ జట్టు నుంచి జాతీయ పోటీల్లో పాల్గొంటారని టీఏబీబీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బెజవాడ రవికుమార్, ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు ప్రకటించారన్నారు. ఈ నెల 12,13,14 తేదీల్లో పంజాబ్ రాష్ట్రం లూథియానాలో 15వ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ పోటీలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను సంఘ ప్రతినిధులు బి.మనోహర్, సీహెచ్.రాజు, సభ్యులు అభినందించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గురువారం 32.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా గుడివాడ మండలంలో 87.8 మిల్లీమీటర్లు, అత్యల్పంగా గూడూరు మండలంలోలో 8.4 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. జిల్లాలోని మిగిలిన మండలాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. బాపులపాడు74.2 మిల్లీమీటర్లు, పెనమలూరు 58.4, గుడ్లవల్లేరు 52.6, మచిలీపట్నం సౌత్, నార్త్ 50.2, కంకిపాడు 42.2, నందివాడ 38.4, ఉంగుటూరు 37.4, గన్నవరం 36.4, పెదపారుపూడి 32.8, కృత్తివెన్ను 32.6 మిల్లీమీటర్లు కురిసింది. మోపిదేవి మండలంలో 31.2 మిల్లీమీటర్లు, పెడన 29.4, చల్లపల్లి 28.4, అవనిగడ్డ 19.8, తోట్లవల్లూరు 19.4, పామర్రు, నాగాయలంక 16.8, ఘంటసాల 15.2, మొవ్వ 14.6, కోడూరు 13.4, ఉయ్యూరు 12.4, పమిడిముక్కల 12.2, బంటుమిల్లి మండలంలో 11.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
మచిలీపట్నంఅర్బన్: బందరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్)లో ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గురువారం కీలక నియామకాలు చేపట్టినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.లీలాప్రసాద్ తెలిపారు. నూతన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్‌ఎంఓ)గా కంటి వైద్య నిపుణులు జి. భానుమూర్తి, అసిస్టెంట్ ఆర్‌ఎంఓలుగా ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజన్, డాక్టర్ నాగలక్ష్మిని నియమించామన్నారు.


