జేసీ నవీన్
మచిలీపట్నంటౌన్: జిల్లా గ్రంథాలయ సంస్థ సేవలు రాష్ట్రంలోనే ఆదర్శమని కృష్ణా జేసీ నవీన్ చెప్పారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం హరిత ఫౌండేషన్ సహకారంతో బుక్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే విలువైన పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు వివిధ శాఖా గ్రంథాలయాలకు అందజేశారు. ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, హరిత ఫౌండేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ సాందేపని వర్జె హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ నవీన్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ పుస్తకాలను వినియోగించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ మాట్లాడుతూ సుమారు రూ. 20 లక్షల విలువైన పుస్తకాలను అందించిన హరిత ఫౌండేషన్, ఎమెస్కో బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పుస్తకాలు గ్రామీణ ప్రాంతంలో వారికి ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి.రవికుమార్, డెప్యూటీ లైబ్రేరియన్ బి. వెంకటరమణ మాట్లాడుతూ జి.రాధికారాణి, యు. యోగేశ్వరరావు, బి.రమేష్, ఉపాధ్యాయులు, గ్రంథాలయ సిబ్బంది, రిఫరెన్స్ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.


