వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ఇంటి సమీపంలో జెండా దిమ్మె నిర్మాణం ‘జనసేన’కు కొమ్ముకాస్తున్న పోలీసులు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో జనసేన నేతల రాజకీయ రౌడీయిజం రోజు రోజుకూ మితిమీరుతోంది. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి అతి సమీపంలో జనసేన జెండా దిమ్మెను నిర్మించి రాజకీయ చిచ్చు రేపేందుకు శుక్రవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూనుకున్నారు. పోలీసుల సమక్షంలోనే పక్కాగా కాంక్రీటుతో దిమ్మె నిర్మించారు.
రెండో రోజు అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నేతలు
రామానాయుడుపేటలో గురువారం జనసేన, వైఎస్సార్ సీపీ నాయకులకు జెండా ఏర్పాటు విషయంలో వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు జనసేనకు కొమ్ముకాస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై జులుం ప్రదర్శించి అక్కడి నుంచి బలవంతంగా పంపేశారు. శుక్రవారం జనసేన నాయకులు పోలీసుల సమక్షంలో అదే ప్రాంతంలో జెండా దిమ్మె నిర్మాణానికి పూనుకున్నారు. సమాచారం తెలిసిన వైఎస్సార్ సీపీ నాయకుడు, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మరి కొంత మంది.. జనసేన నాయకుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను అక్కడ నుంచి పంపడానికి యత్నించారు. ఆ సమయంలో పోలీసులు, విఠల్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
బొర్రా విఠల్ అక్రమ నిర్బంధం
ఇదే అవకాశంగా భావించిన పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకుడు బొర్రా విఠల్‌ను బలవంతంగా జీపులోకి ఎక్కించి గూడూరు పోలీస్‌స్టేషన్ తరలించి అక్రమంగా నిర్బంధించారు. అక్కడ ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. పోలీసులపై విఠల్ దాడి చేశాడనే సాకు చూపించి ఆయనపై అక్రమంగా కేసు బనాయించేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు సమాచారం. ఇతర నాయకులను బైండోవర్ చేసి భయపెట్టడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గూడూరులో పోలీసుల ఓవరాక్షన్!
గూడూరు: బొర్రా విఠల్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఆ సమయంలో బలప్రయోగం చేయడంతో విఠల్ చేతి వేలికి తీవ్ర గాయమై రక్త స్రావమైంది. తనపై ఎలాంటి కేసు లేకుండా ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న విఠల్ ప్రశ్నకు పోలీసులు స్పందించలేదు.
సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గూడూరు పీఎస్‌కు తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీసీ నాయకుడి అక్రమ అరెస్టుపై శ్రేణులు పీఎస్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేసమయంలో మచిలీ పట్నం ఇన్‌చార్జి పేర్ని కిట్టు, ఇతర నేతలు స్టేషన్‌కు వచ్చారు. పెడన ఇన్‌చార్జి ఉప్పాల రాము కూడా స్టేషన్‌కు రావడంతో పోలీసులు విఠల్‌కు నోటీసులు ఇచ్చి బయటకు పంపేశారు.
నడుచుకుంటూ..
అయితే తనను ఎలా పోలీసు వాహనంలో తీసుకువచ్చారో అలాగే తీసుకెళ్లి దించాలంటూ పట్టుబట్టారు. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో గూడూరు స్టేషన్ నుంచి నడుచుకుంటూ మచిలీ పట్నం బయలుదేరారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కూడా గూడూరుకు చేరుకున్నారు. పేర్ని నాని, ఉప్పాల రాము, పేర్ని కిట్టు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పాదయాత్రగా గూడూరు సెంటరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితిని గమనించిన పోలీసులు బొర్రా విఠల్‌ను పోలీసు వాహనంలోకి ఎక్కించుకుని మచిలీపట్నం తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది.


