గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో నోటిఫై చేసిన 123 బ్లాక్ స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా రహదారి భద్రత కమిటీ (డీఆర్‌ఎస్‌సీ) సమావేశం జరిగింది. జిల్లాలో రహదారి ప్రమాదాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్, హిట్ అండ్ రన్ స్కీమ్ అమలు, ఈ–డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్టు తదితరాలపై చర్చించారు. గత సమావేశంలో తీర్మానించిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలను సమీక్షించారు. గతేడాది 1,105 రహదారి ప్రమాదాలు జరగగా 373 మరణాలు సంభవించాయని, 967 మంది క్షతగాత్రులయ్యారని వివరించారు. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో 171 ప్రమాదాలు జరగ్గా.. 58 మరణాలు నమోదయ్యాయని తెలిపారు.
ద్విచక్ర వాహన ప్రమాదాలే అధికం..
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భాగస్వామ్య పక్షాలు పటిష్ట సమన్వయంతో పనిచేసి రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందన్నారు. 38 శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలకు సంబంధించినవేనని.. ఈ నేపథ్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
ట్రాఫిక్ డేటా సమగ్ర విశ్లేషణ..
విజయవాడలో ట్రాఫిక్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు రియల్‌టైమ్ డేటాను విశ్లేషిస్తున్నామని సీపీ రాజశేఖరబాబు అన్నారు. డీటీసీ ఎం.పురేంద్ర, డీసీపీ (ట్రాఫిక్) షేక్ షరీన్ బేగం, ఆర్‌టీవో ఆర్.ప్రవీణ్, ఎంవీఐలు ఎంవీఎన్ రాజు, మొహమ్మద్ అలీ, పూర్ణిమ, అధికారులు పాల్గొన్నారు.
రహదారి భద్రత కమిటీ సమావేశంలో
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


