ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విపత్తులపై ప్రజలు విస్తృత అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని.. ముందస్తు సిద్ధత, అప్రమత్తతతో ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా అధికార యంత్రాంగం, విపత్తు స్పందన–అగ్నిమాపక శాఖ, ఎన్‌డీఆర్‌ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఫెమిలియరైజేషన్ ఎక్సర్‌సైజ్(ఫామెక్స్)–2026లో భాగంగా మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడే విధానంతో పాటు ఫైర్ డెమో, వాటర్ డెమో నిర్వహించారు. అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి వచ్చిన అధునాతన పరికరాలు, ఫైర్ బాల్ పనితీరు, ఏబీసీ పౌడర్ ఆధారిత అగ్నిమాపక పరికరాలు, కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్‌ల పనితీరును ప్రదర్శించారు. కొండపావులూరు ఎన్‌డీఆర్‌ఎఫ్ పదో బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ భూపేంద్ర కుమార్ సారథ్యంలో బృంద సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందస్తు సన్నద్ధతతో సమర్థత..
మాక్ డ్రిల్ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ విపత్తులపై సరైన అవగాహన, ముందస్తు సన్నద్ధతతోనే వాటిని సమర్థంగా ఎదుర్కొనగలమని పేర్కొన్నారు. డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, ఆటోనగర్ అగ్నిమాపక కేంద్ర అధికారి జి.రామారావు, ఎన్‌డీఆర్‌ఎఫ్ టీం సభ్యులు కె.వెంకటేశ్వర్లు, ఎస్‌ఆర్‌కేజీ వెంకట్, ఐ.హరికృష్ణ, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని పాల్గొన్నారు.


