ప్రత్యేక షెడ్డులో భద్రపరిచిన నూతన రథం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక షెడ్డులో భద్రపరిచిన నూతన రథం

Mar 13 2026 9:00 AM | Updated on Mar 13 2026 9:00 AM

ప్రత్యేక షెడ్డులో భద్రపరిచిన నూతన రథం రెండో శనివారం పాఠశాలలు పనిచేస్తాయి ప్రశాంతంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్ష పదో తరగతి బ్రిడ్జి కోర్స్‌పై రేపు కలెక్టర్‌ అవగాహన మారుతున్న జీవనశైలితో కిడ్నీ వ్యాధులు

మోపిదేవి: ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆర్థిక సహకారం కోటి రూపాయలతో తయారుచేసిన కొయ్య రథాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో గురువారం భద్రపరిచారు. మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానానికి స్వామివారి బ్రహ్మోత్సవాలకు గాను బహూకరించిన ఈ రథాన్ని ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సినీ నిర్మాత నారాయణరావుతో వేదపండితులు ఉదయం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డులో రథాన్ని భద్రపరిచినట్లు ఆలయ సూపరింటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావు వెల్లడించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, ఆలయ అఽధికారులు బర్మా ప్రసాద్‌ పాల్గొన్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: జిల్లా విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు ఈ నెలలో వచ్చే రెండో శనివారం పాఠశాలలు పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. భారీ వర్షాలు, మోంథా తుపాను కారణంగా గతంలో ప్రకటించిన సెలవులకు మార్చి 14 తేదీ పరిహార పనిదినంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.

మచిలీపట్నంఅర్బన్‌: జిల్లాలో ఇంటర్మీడియెట్‌ ఫస్ట్‌ ఇయర్‌ కామర్స్‌–1 పరీక్ష గురువారం ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియెట్‌ పరీక్షల అధికారి ఎస్‌.సరళ కుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,806 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు కాగా, 1,631 మంది హాజరయ్యారు. 175 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మొత్తం 90 శాతం హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సెట్‌–1 ప్రశ్నపత్రం వినియోగించినట్లు వివరించారు.

మచిలీపట్నంఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించనున్న పదో తరగతి బ్రిడ్జి కోర్స్‌ శిక్షణ తరగతులపై కృష్ణాజిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అవగాహన కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు తెలిపారు. ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠ శాలల్లో 9వ తరగతి నుంచి పదో తరగతికి వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారన్నారు. మార్చి 13 నుంచి ప్రారంభమయ్యే బ్రిడ్జి కోర్స్‌ శిక్షణపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డీఈఓ చెప్పారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు. ప్రపంచ కిడ్నీ డేను పురస్కరించుకుని ఏపీ నెఫ్రాలజిస్ట్‌ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం వాక్‌థాన్‌ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌ వద్ద వాక్‌థాన్‌ను సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు జెండా ఊపి ప్రారంభించగా, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మధుమేహం, రక్తపోటు ఉన్న వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.సాయిసుధీర్‌, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు, నెఫ్రాలజిస్ట్స్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.అమ్మన్న, సీనియర్‌ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ ఎంవీ సాయికృష్ణ, విజయ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ చైర్మన్‌ టి.అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement