● ప్రతిఘటించిన వైఎస్సార్ సీపీ పెనమలూరు ఇన్‌చార్జి చక్రవర్తి ● గ్రామంలో ఉద్రిక్తత
పెనమలూరు: కానూరులో దళితుడి ఇల్లును మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. సమాచారం తెలుపుకున్న వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి బాధితుడికి అండగా ఆ ఇంట్లో బైఠాయించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ నజీర్, పోలీసులతో చక్రవర్తికి తీవ్ర వాగ్వాదం జరగటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కానూరులో మురుగుకాలువ కట్టపై చాలా కాలంగా పేదలు ఉంటున్నారు. ఇటీవల పేదల ఇళ్లను కూటమి ప్రభుత్వం కూల్చింది. అయితే దమ్ము ప్రమీలారాణి, దమ్ము ప్రసన్నకుమార్ ఇల్లుతో పాటు జనసేన నాయకుడి ఇళ్లను కూల్చలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్ నజీర్, సీఐ వెంకటరమణ, సిబ్బంది జేసీబీతో ఒక్కసారిగా వచ్చి ప్రసన్నకుమార్ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే జేసీబీతో కూల్చడానికి సిద్ధపడి రేకులు ధ్వంసం చేశారు.
స్పృహ తప్పిన యజమానురాలు
మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు ఒక్కసారిగా ఇంటిపై దాడి చేయటంతో ఇంట్లో ఉన్న ఇంటి యజమానురాలు ప్రమీలారాణి తీవ్ర ఆందోళన చెంది కుప్పకూలిపోయింది. ఆమెకు బీపీ పెరిగి, షుగర్ తగ్గటంతో చలనం లేకుండా పడిపోయింది. దీంతో ఆమెను 108 వాహనంలో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు రోదనలు అందరినీ కలిచివేసింది.
చక్రవర్తి నిరసనతో పట్టా అందజేత..
సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ పెనమలూరు ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి వచ్చి బాధితుడి ఇంట్లో బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నోటీసు ఇవ్వకుండా ఇంట్లో మనుషులు ఉండగానే ఇల్లు ఎలా కూల్చుతారని కమిషనర్ నజీర్‌ను నిలదీశారు. పేదల ఇళ్లే టార్గెట్ చేయటం తగదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇల్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కళ్లల్లో ఆనందం చూడటానికి కమిషనర్ తన పరిధి దాటుతున్నాడని ఆరోపించారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. బాధితుడికి వెంటనే ఇంటి పట్టా ఇప్పించారు.
బాధితులు నిరసన..
గతంలో ఇదే ప్రాంతంలో ఇళ్లు తొలగించి బాధితులకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు. బాధితులు పట్టాలతో వచ్చి కమిషనర్ నజీర్, తహసీల్దార్ రాజును నిలదీశారు. తాడిగడపలో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారని అక్కడ ఇళ్లు కట్టుకోవటానికి కనీసం దారి కూడా లేదన్నారు. పేదలను ప్రలోభాలు పెట్టి మోసం చేయటం న్యాయం కాదన్నారు. కాలవ కట్టపై తాము ఖాళీ చేసిన స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం ఎలా పెట్టారని అధికారులను నిలదీశారు. అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


