స్థానికుల తాగునీటి అవసరాలు తీర్చలేకపోతున్న రిజర్వాయర్ శిలాఫలకానికే పరిమితమైన రెండో రిజర్వాయర్ నిర్మాణం వాడుక అవసరాలకు ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్న వీఎంసీ
జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో తాగునీటికి కటకట
రెండో రిజర్వాయర్ శిలాఫలకానికే పరిమితం
భవానీపురం(విజయవాడపశ్చిమ): జక్కంపూడి వైఎస్సార్ కాలనీవాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ఏడాదికేడాది ఎదురు చూపులు తప్ప తాగునీటి సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదు. కాలనీ ఏర్పాటై దశాబ్ద కాలం గడిచింది. అయినా నేటికీ మంచినీళ్ల కోసం స్థానికులు అల్లాడుతున్నారంటే అటు విజయవాడ నగరపాలక సంస్థ, ఇటు గొల్లపూడి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలు చేసి స్థానికులు దాహార్తి తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వాడుక అవసరాలకు సైతం చాలీచాలని నీటితో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కాలనీలో ఎవరిని కదిపినా నీటి కష్టాలను ఏకరువు పెడుతున్నారు. గొంతెండిపోతున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో రిజర్వాయర్ నిర్మాణం దేవినేని ఉమా మహేశ్వరరావు మైలవరం ఎమ్మెల్యేగా వేసిన శిలాఫలకానికే పరిమితమైందని కాలనీవాసులు ఎద్దేవా చేస్తున్నారు.
35వేల మందికి ఒక్కటే ట్యాంక్..
కాలనీలో మొత్తం 280 బ్లాకులు ఉన్నాయి. ఒక్కో బ్లాక్‌లో 32 ఫ్లాట్లు చొప్పున ఉన్నాయి. ఫ్లాట్‌కు కనీసం నలుగురు చొప్పున లెక్కేసుకున్నా సుమారు 35 వేల మందికిపైగానే నివసిస్తున్నారు. కాలనీ మొత్తం మీద 1500 కేఎల్ సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ మాత్రమే ఉంది. ఇది కాలనీకి ఒక వైపు ఉండగా అటు పక్కన ఉండే బ్లాకుల్లోని ప్రజలకు మాత్రమే వాడకం నీరు అరకొరగా అందుతోంది. కాలనీకి మరో వైపు బ్లాకుల్లో నివసించే ప్రజలు నీటి ట్యాంకర్ల కోసం ఎదురు చూపులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని బ్లాకుల్లో సుమారు 20 వరకు బోర్లు ఉండగా వాటి ద్వారా వచ్చే నీటిని మాత్రం వాడుకుంటున్నారు.


