గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు 2021, జనవరి 21వ తేదీన ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఉపాధి కల్పించడంలో భాగంగా ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా ఒక్కొక్కరికి సుమారుగా రూ.6 లక్షల విలువైన వాహనాన్ని అందజేశారు. ఈ వాహనం ఖరీదులో పది శాతం మాత్రమే లబ్ధిదారులు ముందుగా చెల్లించారు. బ్యాంకు రుణాలను తీర్చేందుకు ఆయా కార్పొరేషన్ల నుంచి ఒక్కొక్క వాహనానికి నెల వాయిదా పద్ధతిలో రూ.6 వేలు, ఆపరేటర్ల వేతనం నుంచి రూ.3 వేలు చెల్లించేవారు. ఈ విధంగా ఆపరేటర్లకు నెలవారీ వాయిదా, సహాయకుడి వేతనం, డీజిల్ ఖర్చు కలిపి ప్రభుత్వం నుంచి నెలకు రూ.21 వేలు చెల్లించారు. ఈ విధంగా ఆపరేటర్లు రేషన్ పంపిణీని 15రోజుల్లో పూర్తి చేసి నెలలో మిగిలిన 15 రోజులు ఇతర పనులు చేసుకొని ఉపాధి పొందేవారు. నాలుగేళ్ల పాటు ఉపాధి పొందిన ఆపరేటర్లుకు చంద్రబాబు ప్రభుత్వం షాకిచ్చింది. వాహనాలతో రేషన్ మాఫియా సాగుతోందని అసత్యాలు వల్లెవేస్తూ వాటిని తొలగించింది. ఇప్పుడు ఉపాధి పోయి ఆ వాహనాలకు తమ పేరుకు మారక, వాటిని విక్రయించే వీలు లేక, ఇన్సూరెన్స్ చెల్లించలేక ఆపరేటర్లు నరకయాతన పడుతున్నారు.


