పెండింగ్‌ ని‘బంధనాలు’! | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ ని‘బంధనాలు’!

Feb 18 2026 7:57 AM | Updated on Feb 18 2026 7:57 AM

పెండింగ్‌ ని‘బంధనాలు’!

పెండింగ్‌ ని‘బంధనాలు’!

పెండింగ్‌ ని‘బంధనాలు’! ‘ఉపాధి హామీ’కి అడ్డంకిగా పాత పనులు

ఇటీవల కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఇరవై పనులకు మాత్రమే అవకాశం పైగా పాత పనులు పూర్తి చేస్తేనే కొత్త వాటికి వీలు ఎన్టీఆర్‌ జిల్లాలో దశాబ్ద కాలానికి పైగా పెండింగ్‌లో 32వేల పనులు

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..

‘ఉపాధి హామీ’కి అడ్డంకిగా పాత పనులు

జి.కొండూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రక్షాళన చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టంతో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమవుతోంది. దశాబ్ద కాలానికి పైబడి ఉపాధి హామీ పథకంలో వివిధ కారణాలను చూపుతూ పాత పనులను క్లోజ్‌ చేయకుండా వదిలేయడంతో అవన్నీ ఇప్పుడు కొత్త పనుల ప్రారంభానికి అడ్డొస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో నేడు ఉపాధి హామీ పథకంలో కూలీలు తమ పని దినాలను కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో బిల్లులు పెండింగ్‌లో ఉంచడంతో ఉపాధి హామీ పథకంలో భాగంగా పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన సీసీ రోడ్లు, భవన నిర్మాణ పనులు క్లోజ్‌ కాక నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణానికి బ్రేక్‌ పడుతోంది.

పేరుకుపోయిన పాత పనులు..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నూతన చట్టం ప్రకారం ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 20 పనులు మాత్రమే జరుగుతూ ఉండాలి. ఇలా జరుగుతున్న పనులలో పూర్తయిన వాటిని క్లోజ్‌ చేసిన వెంటనే కొత్త పనులను యాడ్‌ చేసుకునేలా నిబంధన విధించారు. అయితే దశాబ్ద కాలానికి పైబడి పాత పనులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉండడం వల్ల ఒక్కొక్క గ్రామ పంచాయతీలో వందకి పైబడి పాత పనులే పెండింగ్‌ చూపిస్తుండడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. పాత పనులను క్లోజ్‌ చేస్తేనే కొత్త పనుల ప్రారంభానికి వీలు కలిగేలా ఆన్‌లైన్‌ వ్యవస్థను రూపొందించడంతో ఇప్పుడు పలు చోట్ల పనులు ప్రారంభానికి సమస్య తలెత్తుతోంది. ఈ విధంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 32వేల పనులు పెండింగ్‌లో ఉండటంతో వీటిని క్లోజ్‌ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 20వేల పనులను క్లోజ్‌ చేయడంతో పాటు జిల్లాలో ఉన్న 288 గ్రామ పంచాయతీలకు గానూ 170 గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌ పనులను క్లోజ్‌ చేసి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఇరవైలోపు పాత పనులు ఉండేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం కొన్నిపెండింగ్‌ పనులకు మినహాయింపు ఇవ్వడంతో 5,500వరకు పాత పనులు క్లోజ్‌ చేసే వీలు కలిగింది.

కొత్త పనుల ప్రారంభానికి తలనొప్పి..

నూతన చట్టం అమలుతో యుద్ధ ప్రాతిపదికన పెండింగ్‌ పనులను క్లోజ్‌ చేసే ప్రక్రియ మొదలు పెట్టిన అధికారులు అన్ని గ్రామ పంచాయతీలలో 20లోపు పాత పనులు ఉండేలా చేస్తున్నారు. కానీ 20లోపు పెండింగ్‌ పనులలో పంచాయతీరాజ్‌ పనులే ఉండడంతో ప్రభుత్వం ఎప్పుడు బిల్లులు ఇస్తుందో, ఆ పెండింగ్‌ పనుల ఎప్పుడు క్లోజ్‌ చేస్తారో తెలియక నూతన పనులు ప్రారంభానికి అవకాశం లేక క్షేత్రస్థాయిలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 2025, మార్చి 31వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు మెటీరియల్‌కు 192 పనులకు గానూ రూ.32కోట్లు కేటాయించారు. ఈ పనులలలో పలు చోట్ల సీసీ రోడ్లు, కాంపౌండ్‌ వాల్స్‌, బీటీ రోడ్లు వంటివి ఇంకా నిర్మించాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా క్యాటిల్‌ షెడ్లు వెయ్యికి 850 గ్రౌండ్‌ కాగా 500షెడ్లు మాత్రమే పూర్తయ్యాయి.

పని దినాల లక్ష్యం పూర్తవుతుందా

ఎన్టీఆర్‌ జిల్లాలో జాబ్‌కార్డులు 2లక్షల8వేలు ఉండగా, కూలీలు 2,95,234 మంది ఉన్నారు. వీరికి 41లక్షల పనిదినాలు ఈ ఏడాది కల్పించాల్సి ఉండగా 38లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. మిగిలిన అభివృద్ధి పనులు, పనిదినాలు మార్చి 31వ తేదీ లోపు పూర్తవ్వాలంటే పాత పెండింగ్‌ పనులు అడ్డు పడుతున్నాయి. అంతే కాకుండా మార్చి తర్వాత చేపట్టబోయే నూతన పనులకు సైతం పెండింగ్‌ పనుల తలనొప్పి తప్పేలా లేదు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పంచాయతీరాజ్‌ శాఖ కింద చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమై, ఎన్నికల ముందు పూర్తయిన నిర్మాణాలు, నిర్మాణ దశలో ఆగిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్‌ సెంటర్లకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు పెండింగ్‌లో ఉంచడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తి 200కి పైగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఎన్నికల ముందు నిర్మించిన సీసీ రోడ్లు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించిన సీసీ రోడ్లకు సైతం రూ. 20కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌ పెట్టడంతో పనులు క్లోజ్‌ కాక సమస్య తలెత్తుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement