విస్సన్నపేటలో కారు బీభత్సం
మద్యం మత్తులో ఉన్న ఇద్దరి అరెస్ట్
విస్సన్నపేట: మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంగా కారు నడుపుతూ.. దారి పక్కన ఉంచిన వాహనాలను ఢీకొంటూ.. ఎదురుగా వస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు. అదృష్టవశాత్తూ కారు రోడ్డు పక్కన విద్యుత్ స్తంభానికి ఢీకొని ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..
విస్సన్నపేట ప్రధాన రహదారిలో శుక్రవారం ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ భయానక వాతావరణం సృష్టించారు. కొందరి వాహనాలను ఢీకొనడంతో అవి దెబ్బతినడంతో పాటు పలువురికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో స్థానికులు కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో నూజివీడు రోడ్డులో వెళ్లిన కారు రహదారి పక్కనే ఉన్న విద్యుతు స్తంభాలకు ఢీకొని ఆగిపోవటంతో స్థానికులు కారులో ఉన్న ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. ఎ. కొండూరు మండలం పాత రేపూడికి చెందిన కొప్పుల గొవర్థన్, కొప్పుల ప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నామని, కారు నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ అర్జున్‌రాజు తెలిపారు.


