నిర్మాణంలో గోడ కూలి కార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

నిర్మాణంలో గోడ కూలి కార్మికుడు మృతి

Feb 21 2026 8:06 AM | Updated on Feb 21 2026 8:06 AM

నిర్మాణంలో గోడ కూలి కార్మికుడు మృతి

నిర్మాణంలో గోడ కూలి కార్మికుడు మృతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): ఐదో అంతస్తులో నిర్మాణంలో ఉన్న ఒక భవనం గోడ కూలి అక్కడ పనులు చేస్తున్న కార్మికులపై పడటంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయ పడ్డారు. ఈ ఘటన గురువారం సాయంత్రం సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామానికి చెందిన జోరిగే సురేంద్ర (36) గురువారం సత్యనారాయణపురం, కొమ్మువారి వీధిలోని నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవన నిర్మాణంలో తాపీ పనులు చేసేందుకు వెళ్లాడు. సాయంత్రం మారుతీనగర్‌కు చెందిన పల్లా రామారావు, సూరిబాబులతో కలసి సురేంద్ర పరంజాల మీద నిల్చొని ప్లాస్టింగ్‌ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో అంతకు ముందు కట్టిన గోడ కూలి వారి మీద పడటంతో వారు అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ సమయంలో రామారావు, సూరిబాబులు వేలాడుతున్న పైపుల మీద పడి అక్కడ నుంచి జారుతూ కిందపడ్డారు. సురేంద్ర మాత్రం ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందపడటంతో తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే తోటి కార్మికులు ముగ్గురిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సురేంద్ర అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మరో ఇద్దరు కార్మికులు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై సమాచారం అందటంతో ఎస్‌ఎన్‌పురం పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు.

న్యాయం చేయాలి..

పని ప్రదేశంలో ప్రమాదానికి గురై మృతి చెందిన సురేంద్రకు భార్య మహాలక్ష్మి, పదో తరగతి, ఆరో తరగతి, రెండో తరగతి చదువుతున్న ముగ్గురు ఆడపిల్లల సంతానం ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు అయిన సురేంద్ర మృతిచెండటంతో ఆడపిల్లలతో కలసి ఎలా జీవించాలని భార్య బోరున విలపిస్తున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఎన్‌పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భద్రతా ప్రమాణాలు లేకుండానే..

పని ప్రదేశంలో ప్రమాదం జరిగి కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన భవన నిర్మాణ బిల్డర్‌ తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని కేసును నీరుగార్చే చర్యలు చేపడుతున్నాడని బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకుండా ప్రమాదకరంగా పనులు చేయించిన బిల్డర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement