బాల్యాన్ని నులిమేస్తుంది.. జాగ్రత్త!
నులి పురుగుల నిర్మూలనతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు
నులి పురుగు.. ఇలా చేస్తే కనుమరుగు
అశ్రద్ధ చేయొద్దు..
లబ్బీపేట(విజయవాడతూర్పు): పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఆరోగ్యమే తొలిమెట్టు. పిల్లల ఎదుగుదల కేవలం ఆహారం మీద మాత్రమే కాదు, వారి కడుపు ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నులి పురుగులు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వారి ఎదుగుదల క్షీణించి, రక్తహీనతకు దారి తీస్తాయి. పిల్లల్లో నులిపురుగుల సమస్య, వాటి ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే ఏటా ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
నులి పురుగులు అంటే..
నులిపురుగులు పిల్లల పేగుల్లో పెరిగే పరాన్న జీవులు. ఇవి అపరిశుభ్రమైన చేతులు, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. మట్టిలో చెప్పులు లేకుండా ఆడటం వల్ల చర్మం ద్వారా కూడా లోపలికి వెళ్లే అవకాశం ఉంది.
చాలా నష్టదాయకం..
● చాలామంది తల్లిదండ్రులు దీనిని చిన్న సమస్యగా భావిస్తారు. కానీ ఇది తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని వైద్యులు చెబుతారు. రక్తహీనతకు దారి తీయొచ్చు. నులి పురుగులు రక్తంలోని పోషకాలను పీల్చుకోవడం వల్ల పిల్లలు పాలిపోయి కనిపిస్తారు.
● మనం ఇచ్చే బలమైన ఆహారాన్ని పిల్లల శరీరం గ్రహించకుండా ఈ పురుగులు అడ్డుకుంటాయి.
● శారీరక, మానసిక ఎదుగుదల తగ్గుతుంది.
● ఏకాగ్రత లోపించి చదువులో వెనుకబడతారు. ● త్వరగా అలసిపోతారు.
ఇలా గుర్తించాలి..
కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం. బరువు తగ్గడం, ఎదుగుదల లేకపోవడం, మలద్వారం వద్ద దురద (ముఖ్యంగా రాత్రి వేళల్లో), తరచూ వాంతులు, విరేచనాలు అవ్వడం జరుగుతుంది.
కలుషిత ఆహారం, తాగునీటి ద్వారా శరీరంలోకి..
తద్వారా చిన్నారుల్లో రక్తహీనత
ఎదుగుదల లోపించి ఇబ్బందులు
జాగ్రత్త వహించాలంటున్న వైద్యులు
వైద్యులు సూచించిన విధంగా పిల్లలకు నులి పురుగుల మాత్రలను తప్పనిసరిగా వేయించాలి. ఇది సురక్షితమైనది.
భోజనానికి ముందు, మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
పిల్లల గోర్లు పెరగకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే గోర్ల కింద మురికిలో పురుగుల గుడ్లు ఉంటాయి.
తాగునీరు శుభ్రంగా ఉండాలి. పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే వాడాలి.
నులి పురుగులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తరచూ కడుపునొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో వైద్యుడితో పరీక్షలు చేయించి నులి నివారణ మాత్రలు వేయాలి. అంతేకాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేస్తే మంచిది. – డాక్టర్ వైభవ్ వెంకటేష్, పిడియాట్రిక్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
బాల్యాన్ని నులిమేస్తుంది.. జాగ్రత్త!


