సాఫ్ట్ టెన్నిస్‌లో ఏపీ క్రీడాకారుల సత్తా
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పంజాబ్ రాష్ట్రం లూథియనాలో ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు జరిగిన 2వ ఏషియన్ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ చాంపియన్‌షిప్–2026లో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ చూపి పతకాలు సాధించడం గర్వకారణంగా ఉందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఏ.రవినాయుడు అన్నారు. పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలోని శాప్ కార్యాలయంలో సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ ఏఎస్ వైశాలి అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం, పీవీ చిన్హాస్ అండర్–15 బాలుర డబుల్స్ విభాగంలో కాంస్య పతకం, అండర్–18 బాలుర డబుల్స్ విభాగంలో ఎం.రేవంత్ కాంస్య పతకం సాధించారని వివరించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


