సింగన్నగుంట చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
గన్నవరం: చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక ఎస్సీ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బొజ్జ వెంకటేశ్వరరావు(45) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ వివాదాల కారణంగా అతని భార్య, పిల్లలకు దూరంగా ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గుణదలలో మేరీమాత ఉత్సవాల్లో ఖర్జూరం, జీడీలు విక్రయించేందుకుగాను భీమవరానికి చెందిన వ్యాపారులు అతనిని తీసుకువచ్చారు. అయితే గుణదల నుంచి గన్నవరం వచ్చిన వెంకటేశ్వరరావు సోమవారం ఉదయం స్థానిక ఎస్సీ కాలనీలోని సింగన్నగుంట చెరువులో దూకాడు. నీట మునుగుతున్న అతనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


