అర్జీల పరిష్కారంపై శ్రద్ధ చూపండి
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ చూపాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌తో పాటు కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ నవీన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీల్లో పెండింగ్ ఉండకూడదని, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అర్జీదారుల సమస్యను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అధికారులు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 152 అర్జీలను స్వీకరించారు. పెడన మండలం ముచ్చర్ల గ్రామంలో సుమారు 40 ఎకరాల రొయ్యల చెరువు వల్ల 300 ఎకరాల వరిపంట నాశనమవుతోందని గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. రొయ్యల చెరువుల వల్ల కొన్ని రోజులకు భూమి చౌడు బారి పంటలు పండవని, భూమి మీద ఆధారపడి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని, భూములను పరిశీలించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు.


