ఆన్‌లైన్ బెట్టింగుల దెబ్బకు చోరీలు
● తొలుత అప్పులు చేసి పందేలు
● తర్వాత ఇళ్లలో దొంగతనాలు
● అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
నగరంపాలెం: ఆన్‌లైన్ బెట్టింగుల దెబ్బకు చోరీల బాట పట్టిన అంతర్ రాష్ట్ర దొంగను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన మర్రి శివగోపి ఇంట్లో ఇటీవల రూ.2.35 లక్షల విలువైన బంగారం చోరీ అయినట్లు కేసు నమోదైంది. తెనాలి డీఎస్పీ జనార్దన్ పర్యవేక్షణలో తెనాలి రూరల్ పీఎస్ సీఐ షేక్ నాయబ్‌రసూల్, కొల్లిపర ఎస్‌ఐ ఎన్‌సీ ప్రసాద్‌లు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ ఫుటేజీలో బైక్‌పై వెళ్తూ ముఖానికి మాస్క్ ధరించిన యువకుడ్ని గమనించి, అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామ వాసి పెనుగొండ మల్లికార్జునరెడ్డి అలియాస్ మల్లిగా గుర్తించారని ఎస్పీ చెప్పారు. అరెస్టు చేసి అతడి నుంచి రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.ఐదు వేల నగదు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గతంలో తెనాలి రూరల్ పీఎస్ పరిధిలో రెండు, మేడికొండూరు పీఎస్ పరిధిలో ఒకటి, తెలంగాణలోని హుజూర్‌నగర్, చింతకాని, అనంతగిరి పోలీస్‌స్టేషన్లల్లో మూడు చోరీ కేసులు అతడిపై ఉన్నాయని తెలిపారు. 2024లో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడిన నిందితుడు అప్పులు చేశాడని, తర్వాత చోరీలు ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చోరీలు చేస్తున్నట్లు వెల్లడించారు. తెనాలి డీఎస్పీ, తెనాలి రూరల్ పీఎస్ సీఐ, కొల్లిపర పీఎస్ ఎస్‌ఐతోపాటు ఏఎస్‌ఐ పోతురాజు, హెచ్‌సీ టి.రామకోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు ఎం.కూర్మారావు, ఎన్.పోతురాజులను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు.


