పార్కింగ్ చేసిన కారుల్లో చోరీ చేసే నిందితుడి అరెస్ట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేవాలయాల వద్ద పార్కింగ్ చేసిన కార్ల డోర్‌లు చాకచక్యంగా తెరిచి లోపల ఉన్న ఆభరణాలు చోరీ చేసే అంతర్ జిల్లా నిందితుడిని బుధవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.25 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీసీఎస్ స్టేషన్‌లో ఏడీసీపీ ఎం.రాజారావు వివరాలు వెల్లడించారు. కోనసీమ అంబేడ్కర్ జిల్లాకు చెందిన చింత గణేష్ ఏడో తరగతి వరకూ చదివి కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. 15 ఏళ్లు ఖతార్ దేశంలో డ్రైవర్‌గా చేసి 2019లో తిరిగి ఇండియాకు వచ్చాడు. ఇక్కడ డ్రైవర్‌గా చేస్తూ దురలవాట్లకు బానిస కావడంతో వచ్చే డబ్బులు చాలకపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించేందుకు నేరాలకు పాల్పడుతున్నారు. దేవాలయాల వద్ద పార్కింగ్ చేసిన కార్ల డోర్లు ఓపెన్ చేసి ఆభరణాలు చోరీ చేస్తాడు.
తారాపేటలో అరెస్ట్..
2025 ఏప్రిల్‌లో దుర్గగుడి ఓం టర్నింగ్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారు డోర్లు తెరిసి లోపల బ్యాక్ సీట్‌లో ఉన్న ఆభరణాలు చోరీచేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ సేకరించిన ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వన్‌టౌన్ తారాపేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు చింత గణేష్‌ను సీసీఎస్ సీఐ రామ్‌కుమార్ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించాడు. అతని నుంచి రూ.25 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు రికవరీ చేశామన్నారు. సీపీ ఎస్వీ రాజశేఖరబాబు ఉత్తర్వులు, క్రైమ్ డీసీపీ కె.తిరుమలేశ్వరరెడ్డి సూచనలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడిని అరెస్ట్ చేశామని ఏడీసీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ రామ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
రూ.25 లక్షల విలువ చేసే
ఆభరణాలు స్వాధీనం


