రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి
కాచవరం(ఇబ్రహీంపట్నం): కాచవరం గ్రామ మాజీ సర్పంచ్ మొండితోక వెంకటరత్నం(55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాచవరం గ్రామంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన వెంకటరత్నం తన వ్యక్తిగత పనులపై సమీపంలోని దొనబండ గ్రామానికి తన బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాచవరం చేరుకుని డివైడర్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈప్రమాదంలో లారీ చక్రాలు వెంకటరత్నం మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 2006 – 2011 మధ్య కాలంలో గ్రామానికి సర్పంచ్‌గా వ్యవహరించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ కాలనీకి రూపరేఖలు తెచ్చారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


