ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని కాకానినగర్‌లో వరలక్ష్మి అనే యువతి బుధవారం ప్రియుడి ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా కై కలూరుకు చెందిన వరలక్ష్మి(29), జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్ అనే యువకుడు దాదాపు 13 ఏళ్లుగా కలిసి చదువుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ప్రేమగా మారడంతో గత ఆరేళ్లుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని వరలక్ష్మి చెబుతోంది. ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నామని, సత్యదేవ్ తల్లిదండ్రులు కూడా మా కోడలు నీవే అని పలుమార్లు తనతో చెప్పినట్లు వరలక్ష్మి అంటోంది. అయితే కొంతకాలంగా బాలు సత్యదేవ్ ముఖం చాటేశాడని, అతని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మాటమార్చి తన ప్రియుడిని కనిపించకుండా చేసి, తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని యువతి కోరుతుంది.


