పంచాయతీలలో ఆరోగ్యవనాలు పెంచే యోచన
టి.కొత్తపాలెంలో మోడల్ ప్రాజెక్టు ఆరోగ్య వనాన్ని ప్రారంభించిన కలెక్టర్ బాలాజీ ఆరోగ్యవనం రూపకర్త గ్రామ కార్యదర్శి అశోక్‌కు సత్కారం
టి.కొత్తపాలెం(నాగాయలంక): జిల్లాలో గ్రామీణ స్థాయిలో ఔషధ మొక్కల పెంపకంతో ఆరోగ్య వనాలు పెంపొందించే దిశగా గ్రామ పంచాయతీలను సమాయత్తం చేసేందుకు అధికారులు, సర్పంచ్‌లతో చర్చించి కార్యాచరణ చేపడతామని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ వెల్లడించారు. నాగాయలంక మండలం టి.కొత్తపాలెం గ్రామంలో బుధవారం ఆయన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఔషధ మొక్కలతో మోడల్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన గ్రామ ఆరోగ్య వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వనంలో పెంచిన 21 రకాల ఔషధ మొక్కలను ఆసక్తిగా పరిశీలించారు. ఈ కాన్సెప్ట్ రూపొందించిన గ్రామ కార్యదర్శి ఆది అశోక్ కలెక్టర్‌తో మాట్లాడుతూ పూర్వీకుల ఔషధ విజ్ఞాన పునరుద్ధరణ, అరుదైన ఆయుర్వేద మొక్కల సేకరణ, అంతరించిపోతున్న ఆయుర్వేద సంపద సంరక్షణ లక్ష్యంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో ఆరోగ్యవనం కాన్సెప్ట్‌కు రూపకల్పన చేసినట్లు వివరించారు. ఆలోచనీయమైన, ఆచరణాత్మక మోడల్ ప్రాజెక్ట్‌ను రూపొందించిన అశోక్‌ను కలెక్టర్ అభినందించి సన్మానించారు. అదేవిధంగా గ్రామంలోని కాల్వగట్లు, ప్రభుత్వ ఖాళీభూములు అన్యాక్రాంతం కాకుండా, చెత్తకుప్పల ప్రదేశాలుగా మారకుండా పూలు, క్రోటన్ మొక్కలతో సిమెంట్ బల్లల ఏర్పాటుతో రూపొందించిన మినీ పార్కులను కలెక్టర్ పరిశీలించి సహకరించిన దాతలను సత్కరించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ కష్టసాధ్యమైనప్పటికీ కార్యదర్శి అశోక్, సర్పంచ్ శివపార్వతి నేతృత్వంలో చేపట్టిన గ్రామ ఆరోగ్య వనం ఏర్పాటు స్ఫూర్తి దాయకమన్నారు. జిల్లాలోని కొన్ని పంచాయతీల్లోనైనా ఈ ఆరోగ్య వనాల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పడేలా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా నిరోధించే రీతిలో మినీ పార్కులు పిల్లలకు ఆటవిడుపు కాగలవని చెప్పారు. ప్రజలకు మేలు కలిగించే వినూత్న ఆలోచనలను తప్పకుండా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. సర్పంచ్ శివపార్వతి, ఆమె భర్త శ్రీనివాసరావు, తహసీల్దార్ సీహెచ్‌వీ ఆంజనేయ ప్రసాద్, ఎంపీడీఓ కె.ఎం.చంద్రశేఖర్, డీసీ చైర్మన్ బండ్రెడ్డి నాగమల్లికార్జునరావు (చినబాబు), ఎస్‌ఐ కె.రాజేష్, డీసీ మాజీ చైర్మన్ బీసాబత్తుని ప్రసాద్, బండ్రెడ్డి హరి, వీఆర్వో టీజీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీలలో ఆరోగ్యవనాలు పెంచే యోచన


