రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికకు నోటిఫికేషన్
చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు ఎన్నికల అధికారి బత్తిన రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 11వ తేదీ ఆదివారం మచిలీపట్నంలోని రెవెన్యూ భవన్‌లో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నామినేషన్ పత్రాల జారీ, 11 నుంచి 1.00 గంట వరకు నామినేషన్ల స్వీకరణ, 1.00 నుంచి 1.30 గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ల జాబితా ప్రచురణ చేయటంతో పాటు, 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుందన్నారు. 3.30 గంటలకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటే 4 నుంచి 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని రామకృష్ణ తెలిపారు.
ఎ.కొండూరులో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులు
తిరువూరు: కిడ్నీ వ్యాధుల తీవ్రతతో అల్లాడుతున్న ఎ.కొండూరు మండలంలో ఇటీవల సికిల్‌సెల్ ఎనీమియా, తలసేమియా వ్యాధులు కూడా విస్తరిస్తున్నట్లు ప్రజారోగ్య వేదిక ప్రకటించింది. వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జేవీఎస్ సాయిప్రసాద్, ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌ప్రకాష్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం మండలంలోని చీమలపాడు, కృష్ణారావుపాలెం, ఎ.కొండూరు, చైతన్యనగర్, పోలిశెట్టిపాడు గ్రామాల్లో పర్యటించి ఈ వ్యాధి లక్షణాలను గుర్తించింది. ఇప్పటివరకు తొమ్మిది మంది తలసేమియా వ్యాధిగ్రస్తులు, 11 మంది సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులను గుర్తించినట్లు వేదిక ఒక ప్రకటనలో తెలిపింది. ఎ.కొండూరు, చీమలపాడు, గొల్లమందల, కోమటికుంట, పోలిశెట్టిపాడు, వల్లంపట్ల, మాధవరం, రేపూడి గ్రామాల్లో రెండు వ్యాధుల బారిన పడిన వారున్నారని తెలిపారు.
సకాలంలో గుర్తిస్తే జీవితకాలం పెంపు
తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధులు జన్యుపరమైనవని, వీటిని సకాలంలో గుర్తించి వైద్యం ప్రారంభిస్తే రోగుల జీవిత కాలం పెంచవచ్చని ప్రజారోగ్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి విజయప్రకాష్ తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు తెలియజేసి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ నెల 28న ఎ.కొండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజలకు సికిల్‌సెల్ ఎనీమియా, తలసేమియా వ్యాధి లక్షణాలు గుర్తించడానికి రక్త పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలకు సుమారు రూ.15వందలు ఖర్చవుతుండగా, ప్రజారోగ్య వేదిక ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సహకారంతో ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రజలు ఈ పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్థారణ జరిగితే వైద్యసేవలు పొందాలని సూచించారు.
28న గ్రీటింగ్ కార్డ్ డిజైన్ కాంటెస్ట్
వాల్‌పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈతరం చిన్నారులకు గ్రీటింగ్ కార్డులకు ఉన్న ప్రాముఖ్యతను తెలియపరచి వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే లక్ష్యంతో ఈనెల 28న గ్రీటింగ్ కార్డు డిజైన్ కాంటెస్ట్ నిర్వహించనున్నట్లు స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ప్రిన్సిపల్ స్ఫూర్తి శ్రీనివాస్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో గ్రీటింగ్ కార్డు కాంటెస్ట్ వాల్ పోస్టర్‌ను బుధవారం కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఆర్టిజో ఫైన్ ఆర్ట్స్ స్టూడియో, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రీటింగ్ కార్డ్ డిజైన్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈతరం చిన్నారులకు ప్రేమ, ఆప్యాయతలతో ఇచ్చి పుచ్చుకునే గ్రీటింగ్ కార్డుల ప్రాముఖ్యత తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.


