27న కేఎల్‌యూ స్నాతకోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం ఈనెల 27 వ తేదీన వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి.పార్థసారథివర్మ తెలిపారు. విజయవాడ గవర్నర్‌పేట మ్యూజియం రోడ్డులోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 184 మంది పీహెచ్‌డీ, 700 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, 4500 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరిలో 340 ఎంబీఏ, 105 ఎం.టెక్, 40 మంది లా కోర్సులు, 3200 మంది బీ.టెక్, 12 మంది ఆర్కిటెక్చర్, 48 మంది బీ.ఫార్మ్, 330 మంది బీసీఏ, 325 మంది బీబీఏ, 37 మంది బీకామ్, 18 మంది బీఎస్సీ (వీసీ), 25 మంది బీఏ, 180 మంది బీఎస్సీ అగ్రికల్చర్, 14 మంది ఎం.ఫార్మసీ, 32 మంది ఎం.ఎస్సీ (కెమిస్ట్రీ), 220 మంది ఎంసీఏ డిగ్రీ వారు ఉన్నారని వివరించారు. ఈ డిగ్రీలను విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరచిన 44 మంది విద్యార్థులకు బంగారు, 40 మందికి రజత పతకాలను, నగదు బహుమతులను అందించనున్నట్లు చెప్పారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ వినోద్ కె. సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారన్నారు. టాటా మెమోరియల్ సెంటర్, ముంబై ఎండీ, ఐఏపీ పీడియాట్రిక్ హీమాటో–ఆంకాలజీ విభాగ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనవల్లి గౌరవ అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సంధాన కర్త వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. డిగ్రీలు తీసుకునే విద్యార్థులందరికీ ఇప్పటికే సమాచారం అందించామని, 27 వ తేదీ ఉదయం 9 గంటలకు యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమానికి డాక్టర్ కె.సుబ్రమణ్యం, డాక్టర్ కె.రామకృష్ణ ప్రధాన కన్వీనర్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ కేఎస్ జగన్నాధరావు, ఎంహెచ్‌ఎస్ డీన్ డాక్టర్ ఎం.కిశోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


