మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇండియన్ బ్యాంక్ మహిళల స్వయంసమృద్ధి, మహిళా సాధికారతకు కృషి చేస్తుందని బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని బ్యాంక్ జనరల్ మేనేజర్, ఆర్‌బీడీ వి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌లో బుధవారం ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోన్ ఆధ్వర్యాన ఎస్‌హెచ్‌జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్ జరిగింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్‌హెచ్‌జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్‌లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రూ.1150 కోట్ల స్వయం సహాయక బృందాలకు రుణాలను మంజూరు చేశామన్నారు. ఎంతో మంది తమ చిన్న వ్యాపార అవసరాల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి తమ జీవితాలను కష్టతరం చేసుకుంటున్నారని అన్నారు. ఇండియన్ బ్యాంక్ ద్వారా స్వయం సహాయక బృందాల కోసం ఉత్పత్తులను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందవచ్చన్నారు మహిళలకు సాధికారత కల్పించి వారిని లక్షాధికారులగా మార్చటానికి ఉద్దేశించిన ‘సీడ్స్ టు సక్సెస్’ ప్రచారం, లక్షపతి దీదీ గురించి మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. విజయవాడ జోనల్ మేనేజర్ ఎం.రాజేష్ మాట్లాడుతూ విజయవాడ జోన్‌లో స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేకత కలిగిన 4 మైక్రోశాట్ బ్రాంచిలు ఉన్నాయన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 5 వేల స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం అందిస్తోందని, 43 బ్రాంచిలు స్వయం సహాయక బృందాల ఆర్థిక అవసరాలను తీర్చటానికి నిరంతరం పనిచేస్తున్నాయని, బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేష్‌కుమార్, జోనల్ మేనేజర్ ఎన్.గౌరీశంకర్‌రావు, రాష్ట్ర అధికారులు ఏఎన్‌వీ నాంచారరావు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.


