వరుస దొంగతనాల కేసులో నిందితుడు అరెస్ట్
కృత్తివెన్ను: వరుస దొంగతనాలతో మండలంలో సంచలనం రేకెత్తించిన దొంగను 24 గంటల్లో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అరెస్టు చేశారు. కృత్తివెన్ను ఎస్‌ఐ పైడిబాబు బుధవారం నిందితుడిని విలేకరుల ముందు హాజరుపరచి వివరాలు వెల్లడించారు. మండలంలోని అడ్డపర్ర గ్రామంలో సోమవారం రాత్రి 7 ఇళ్లతో పాటు రామాలయంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో బందరు డీఎస్పీ చొప్పిడి రాజా పర్యవేక్షణలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేశారు. ఈ చర్యల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం బొప్పనపల్లికి చెందిన కట్టా సుబ్బారావును పాలకొల్లు సమీపంలోని పూలపల్లిలో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే 30కి పైగా కేసులు ఉండగా పలుసార్లు జైలుకు వెళ్లొచ్చిన నేరచరిత్ర ఉన్నట్లు ఎస్‌ఐ వివరించారు. నిందితుడు రామాలయంలో చోరీ చేసిన రూ.2 వేల నగదు రికవరీ చేసినట్లు చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు.


