సమాజసేవలో పోలీసుల భాగస్వామ్యం అభినందనీయం
జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు
కోనేరుసెంటర్: సమాజసేవలో పోలీసుల భాగస్వామ్యం నిజంగా అభినందనీయమని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు చెప్పారు. విధి నిర్వహణతో పాటు సమాజంలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న పలువురు పోలీసులను మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో సన్మానించి అభినందించారు. ఇటీవల రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వై.వెంకటరత్నం స్కూలు వదిలిన సమయంలో కొంత మంది పేద విద్యార్థులు మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా రోడ్డుపై వెళుతుండటాన్ని చూసి అందరికీ తన సొంత ఖర్చులతో పాదరక్షలు కొనిపెట్టి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఈ విషయంలో సోషల్‌మీడియా ద్వారా హల్‌చల్ అయింది. అలాగే ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ (డ్రోన్ ఆపరేటర్)గా విధులు నిర్వహిస్తున్న కె.కృష్ణమూర్తి (పిసి–1832) తన పుట్టినరోజును అందరి మద్య ఆడంబరంగా చేసుకోకుండా శీతాకాలంలో చలిపులికి గజగజలాడుతున్న యాచకులకు రగ్గులు, దుప్పట్లును అందజేసి తనలోని మానవత్వాన్ని చాటుకున్నాడు. అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు వెంకటరత్నం, కృష్ణమూర్తిలను తన కార్యాలయానికి పిలిపించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల్లో సేవాభావం అనేది ఎప్పుడూ ఉంటుందన్నారు. అయితే పైకి గాంభీర్యం కనిపించే పోలీసులను మాత్రమే చూస్తారన్నారు. ప్రజాభద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కూడా ప్రజల కోసం పోలీసులు చేసే సేవా కార్యక్రమాలేనని చెప్పారు. మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు మరింత దగ్గరవుతుండటం సంతోషంగా ఉందన్నారు. వెంకటరత్నం, కృష్ణమూర్తి వంటి సిబ్బందిని పోలీసుశాఖలోని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అలాగే ఇదే స్ఫూర్తితో సిబ్బంది రాబోయే రోజుల్లో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా మన్ననలు అందుకోవాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.వి నాయుడు, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


