బీసీ కుల గణన జరపాలని డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జనగణనతో పాటు బీసీ కులగణన చేయాలని బీసీ నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కులగణన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో బీసీ నవ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘హలో బీసీ – చలో విజయవాడ’ పేరిట సోమవారం ధర్నా చేశారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్, బీసీ మహాసభ, బీసీ నవ చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో సీట్లు కేటాయించాలన్నారు. రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు యాదవ్, బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రుషింగప్ప, జెట్టిపాలెం వెంకటేష్ (జాంబవ రాజు) ఎస్సీ, ఎస్టీ, బీసీ పోరాట సంఘం అధ్యక్షుడు చందు, బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు బీసీ రమణ, జై ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు జైబాబు, నవ క్రాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌస్, బీసీ నవ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


