విద్యార్థులకు సైబర్ భద్రతపై నైపుణ్యం అవసరం
పెనమలూరు: విద్యార్థులు సైబర్ భద్రతపై నైపుణ్యం సాధించాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో సోమవారం డాక్టర్ వీఎల్ దత్ బ్లాక్‌లో కేవీరావు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. సైబర్ నేరాలు పెరుగుతున్నందున విద్యార్థుల సైబర్ భద్రతపై నైపుణ్యం సాధించాలని సూచించారు. ఇటువంటి కేంద్రాలు దేశ డిజిటల్ భద్రతకు ఉపయోగపడతాయన్నారు. డెప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ కీలకమయ్యాయని తెలిపారు. కాకినాడ సీపోర్టు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రావు మాట్లాడుతూ పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయటానికి ఇటువంటి కేంద్రాలు చాలా ఉయోగపడతాయని వివరించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాజయ్య, పాలడుగు లక్ష్మణరావు, ఉపకులపతి ప్రొఫెసర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.రవిచంద్, కంప్యూటర్ విభాగాధినతి డాక్టర్ డి.రాజేశ్వరరావు పాల్గొన్నారు.
శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు


