
ఉద్యాన పంటలతో సుస్థిర ఆదాయం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
చందర్లపాడు(నందిగామ టౌన్): ఉద్యాన పంటల సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం లభిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు ఎకరా విస్తీర్ణంలో సాగు చేస్తున్న తైవాన్ జామ తోటను అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది నాలుగు వేల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగును లక్ష్యంగా నిర్దేశించుకోగా.. దాదాపు లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. ఎకరా విస్తీర్ణంలో 444 మొక్కలు నాటారని పథకం కింద రూ.2.51 లక్షల సాయం అందుతుందన్నారు. మొదటి ఏడాది రూ.1,26,110, రెండో ఏడాది రూ.60,707, మూడో ఏడాది రూ. 64,407 చొప్పున రైతుకు అందుతుందని తెలిపారు. ఉద్యాన పంటలతో పాటు పశుపోషణను సైతం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
బంగారు కుటుంబాలతో..
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పీ4 సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ముప్పాళ్ల గ్రామంలోని బంగారు కుటుంబాల లబ్ధిదారులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలోని చెరువులను పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. నందిగామ పట్టణంలోని గ్రోమోర్ ఎరువులు, పురుగు మందుల దుకాణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు విక్రయించాలని యూరియా, తదితర ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్వామా పీడీ రాము, ఆర్డీవో బాలకృష్ణ, చందర్లపాడు ఎంపీడీవో పద్మజ్యోతి, నందిగామ డెప్యూటీ ఎంపీడీవో నామేశ్వరరావు పాల్గొన్నారు.