
తప్పుల్లేని భూ రికార్డులే లక్ష్యం
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కంకిపాడు: ఎలాంటి తప్పులు లేకుండా నాణ్యమైన భూమి రికార్డులను అత్యంత బాధ్యతతో రూపొందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గుడివాడ, ఉయ్యూరు డివిజన్‌ల అధికారులకు స్వామిత్వ సర్వేపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం కంకిపాడులోని శ్రీకృష్ణ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిని, భూమిని సరిహద్దులతో గుర్తించి, సర్వే నంబర్ కేటాయించేలా, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రికార్డులను రూపొందించేందుకు స్వామిత్వ సర్వే దోహద పడుతుందన్నారు. ఆర్‌ఎస్‌ఆర్ మాదిరిగా స్వామిత్వ సర్వే రికార్డులు మదర్ రికార్డు అవుతుందన్నారు. భూమి రికార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పకడ్బందీగా నాణ్యతాయుతంగా రికార్డులను తయారు చేయటంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వహించాలన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ, సర్వే భూ రికార్డుల ఏడీ జోషిలా, డీఎల్‌పీఓ సంపత్‌కుమారి, డీఎల్‌డీఓ రాజేష్, డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు, ఈఓఆర్‌డీలు, ఆయా డివిజన్‌ల పరిధిలోని 175 గ్రామ పంచాయతీలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
పక్కాగా రీసర్వే
పమిడిముక్కల: రీసర్వే పక్కాగా చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ, ఆర్డీఓ హేలా షారోన్ బుధవారం మర్రివాడ వెళ్లి రీసర్వే చేసిన రికార్డులను తనిఖీ చేశారు. రీసర్వేపై ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించారు. త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.