
మీ పురస్కారాలు మాకొద్దు!
కూటమి సర్కారుపై
గురువుల గుర్రు
ఉపాధ్యాయ పురస్కారాలకు ముందుకురాని వైనం
ఏటా వందలాది మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునే పరిస్థితి
ఈ ఏడాది కేవలం 28 మంది మాత్రమే దరఖాస్తు
జిల్లాలో 969 ప్రభుత్వ స్కూళ్లలో 5,160 మంది ఉపాధ్యాయులు
ఏటా 50 నుంచి 60 మందికి..
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎవరికై నా పురస్కారం అనగానే ఎగిరి గంతేస్తారు. ఆ పురస్కారం కోసం ప్రతిభ కలిగిన వ్యక్తులు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అటువంటి అవకాశం వచ్చినప్పుడు వెంటనే దరఖాస్తు చేసుకోవటం సహజం కనిపిస్తుంది. అలాగే దరఖాస్తు చేసుకున్న తరువాత తమకు తెలిసిన ప్రజాప్రతినిధితోనో లేక ఇతర ఉన్నతాధికారులతోనే సిఫార్సులు సైతం చేయిస్తుంటారు. ఇదంతా సహజంగా జరిగే తంతు. కానీ ఈ ఏడాది ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో జరిగే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు గురువులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. విద్యారంగంపై కూటమి ప్రభుత్వం చూపిస్తున్న తీరుపై ఆగ్రహంతో ఉన్న ఉపాధ్యాయులు వారిచ్చే పురస్కారాలకు సైతం ఆసక్తి చూపటం లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో కేవలం 28 దరఖాస్తులే..
ఎన్టీఆర్ జిల్లాలో జరిగే గురుపూజోత్సవానికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఏటా వందలాదిగా దరఖాస్తులు వస్తుంటాయి. వాటి ఎంపికకు పెద్ద కసరత్తు చేసి వారిని ఎంపిక చేస్తుంటారు. కానీ ఈ ఏడాది జిల్లా పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి బుధవారం సాయంత్రానికి కేవలం 28 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీనిపై జిల్లా అధికారులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు పురస్కారాలు ఇస్తామని ప్రకటించినా ముందుకు రాకపోవటంపై అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 5,160 మంది ఉపాధ్యాయులు
ఎన్టీఆర్ జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద సుమారుగా 969 ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. ఆయా విద్యాసంస్థలో సుమారుగా 5,160 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వారిలో నాలుగు వేలమందికి పైగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హులవుతారు. అయితే అందుకోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎంపిక చేసేందుకు చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి 60 మందికి ఇవ్వటానికి అధికారులు సమాయత్తమయ్యారు. తీరా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య కేవలం 28 మంది మాత్రమే ఉండటంతో జిల్లా అధికారులకు ఏమి చేయాలో పాలుపోవటం లేదు.
ప్రభుత్వంపై వ్యతిరేకతతోనేనా?
ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలపై ఉపాధ్యాయులు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అందువల్లే కనీసం పురస్కారాలను తీసుకోవటానికి సైతం ముందుకు రాకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొన్ని అర్థంపర్ధం లేని యాప్‌లతో సతాయిస్తున్నారని వారు చెబుతున్నారు. తాజాగా విద్యార్థులు రాసిన పరీక్షల మూల్యాంకనం భారంతో ఉపాధ్యాయులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉండి ఆయా పరీక్షలు రాసిన బుక్‌లెట్లను దిద్దాలని నిర్ణయించటం వల్ల తరగతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటితో పాటుగా పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవటంపైనా గురువులు తమకిచ్చే పురస్కారాలకు వ్యతిరరేకంగా ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జిల్లా స్థాయిలో జరిగే గురుపూజోత్సవం వేడుకల్లో ఏటా విద్యాశాఖ సుమారు 50 నుంచి 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందిస్తోంది. వివిధ కేటగిరీలతో పాటుగా ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పురస్కారాలను వారికి ప్రదానం చేయటం పరిపాటి. కలెక్టర్ లేదా మంత్రి వంటి ముఖ్యఅతిథుల చేతుల మీదుగా ఆ ప్రదానోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది 60 మంది కి పురస్కారాలు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. గత ఏడాది ఈ గురుపూజోత్సవాన్ని నిర్వహించలేదు. దాంతో ఈ ఏడాది ఇంకా అధికంగా గురువులు దరఖాస్తు చేసుకుంటారని అధికాారులు భావించారు. కానీ అందుకు భిన్నంగా దరఖాస్తులే రాకపోవటంపై సర్వత్రా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.