
దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లను దుర్గగుడి ఈవో వీకే శీనా నాయక్ బుధవారం పరిశీలించారు. ఇంద్రకీలాద్రి దిగువన క్యూ లైన్ల వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ఉత్సవాల సమయంలో భక్తులకు మెరుగైన దర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలకు పాత ఆర్‌బీ ఫ్రేమ్‌ల స్థానంలో సింహాచలం దేవస్థానం నుంచి తెప్పించిన క్యూ ఫ్రేమ్‌ల ఏర్పాటు పనులను ఆయన పర్యవేక్షించారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రసాదం పోటు భవనంలో డ్రెయినేజీ తదితర పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. కొండపై భాగంలో ఏర్పాటు చేస్తున్న కొత్త పూజా మండపాల పనులకు సంబంధించిన వివరాలను ఈఈ–1 కేవీఎస్ కోటేశ్వరరావు ఈఓ శీనా నాయక్‌కు వివరించారు.
మిగిలిన 12 బార్లకు నోటిఫికేషన్ విడుదల
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో మిగిలిన 12 బార్లకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి. గంగాధరరావు తెలిపారు. మొత్తం 12బార్లకు గానూ గుడివాడ పట్టణంలో ఆరు, మచిలీపట్నం కార్పొరేషన్‌లో నాలుగు, పెడన మునిసిపాలిటీలో ఒకటి, బందరు మండలం మంగినపూడిలో ఒక టూరిజం బార్‌కు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. 14వ తేదీ సాయంత్రం 6గంటల వరకు వీటికి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. 15వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ సమక్షంలో డ్రా తీసి షాపులు కేటాయిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు 9963604239, 8466981837లో సంప్రదించాలన్నారు.
ప్రముఖ రేడియాలజిస్ట్ వేమూరికి కీలక పదవి
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడకు చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్ వేమూరి నాగ వరప్రసాద్ ఏషియన్ మస్క్యూలో స్కేలేటల్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన సొసైటీ 27వ వార్షిక సమావేశంలో డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సొసైటీ ఏర్పాటైన రెండున్నర దశాబ్దాల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయుడు వర ప్రసాద్ కావడం విశేషం. ఆయన ఆగస్టు 2027 వరకూ ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇటీవల కాలం వరకూ ఆయన ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్‌ఐఏ)కు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతేకాకుండా ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్‌కు(ఐసీఆర్‌ఐ)కు జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.
స్వామిత్వ సర్వేను వేగవంతం చేయాలి
నందిగామ రూరల్: గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్న స్వామిత్వ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని ఐతవరంలో జరుగుతున్న స్వామిత్వ సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. ముందుగా సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠాలలోని ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులను కల్పించేందుకే ప్రభుత్వం స్వామిత్వ సర్వేను నిర్వహిస్తోందన్నారు. స్వామిత్వ సర్వే పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీల ద్వారా జరుగుతున్న సర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్డీవో బాలకృష్ణ, డీఎల్‌పీవో రఘువరన్, తహసీల్దార్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
వేణుగోపాలుడి హుండీ ఆదాయం రూ. 19.29లక్షలు
తిరువూరు: గంపలగూడెం మండలం నెమలిలోని శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానంలో హుండీ కానుకల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి నాలుగు నెలల పాటు ఆలయంలోని ఆరు హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.19,29,484 నగదు, అన్నదానం హుండీ ద్వారా రూ.32,692 ఆదాయం లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ సంధ్య తెలిపారు. 18 గ్రాముల బంగారం, ఒక కేజీ 596 గ్రాముల 300 మిల్లీగ్రాముల వెండి, 29 అమెరికన్ డాలర్లు, 50 రియాల్స్, 5 యూరోలు కూడా భక్తులు సమర్పించినట్లు వెల్లడించారు.