
వారితో ఆస్పత్రికి సంబంధం లేదు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో శిశువును అపహరించి, మరొకరికి అప్పగించేందుకు రూ.4 లక్షలకు ఒప్పందం చేసుకున్నారని జరిగిన ప్రచారం మంగళవారం కలకలం రేపింది. శిశువును అప్పగిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన విషయంపై పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఆ వార్తల్లో ఉన్న పేర్లతో ఆస్పత్రిలో సిబ్బంది ఎవరైనా ఉన్నారా అనే కోణంలె సూప రింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు మంగళవారం విచారణ జరిపారు. వైద్యులు, నర్సింగ్ వైద్య సిబ్బంది, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందిలో కూడా ఫాతిమా పేరుతో ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చారు. బయటి వ్యక్తులు మోసం చేసేందుకు అలా చెప్పి ఉంటారని భావిస్తున్నారు.
సీసీ కెమెరాల పుటేజీ పరిశీలన
పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతాశిశు విభాగంలో ఉన్న సీసీ కెమెరా పుటేజీని పోలీసులు, ఆస్పత్రి అధికారులు మంగళవారం పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా ఈ నెల 18న అర్ధరాత్రి 12 నుంచి వేకువ జాము మూడు గంటల వరకూ ఆ విభాగంలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా అనే కోణంలో పరిశీలన జరిపారు. ఆ విభాగం బ్లాక్‌తో పాటు, బయట ఉన్న సీసీ కెమెరాల పుటేజీల్లో అనుమానాస్పదంగా ఉన్నట్లు కనిపించలేదు. దీంతో ఆ సమయంలో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు రికార్డు చేసి తీసుకున్నారు. ప్రసూతి విభాగం నుంచి బయటి వ్యక్తులు కానీ, ఆస్పత్రిలో తెలిసిన వ్యక్తులు కానీ శిశువును అక్రమంగా తరలించేందుకు అవకాశమే లేదని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు స్పష్టంచేశారు. పుట్టిన వెంటనే ప్రతి శిశువుకు ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ట్యాగ్‌లు వేస్తామని, ఎవరైనా ఆ శిశువును బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అలారం మోగుతుందని పేర్కొన్నారు. వార్డు డోర్ వద్ద, రిసెప్షన్, పోలీసు అవుట్ పోస్టు, ఆ బ్లాక్ నుంచి బయటకు వెళ్లే గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. డబ్బుల కోసం వైద్యురాలు అని చెప్పి నమ్మించి, మోసం చేసి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు విభాగం
ఆ రోజు ఆస్పత్రి ప్రాంగణంలో ఎవరూ అనుమానాస్పదంగా తిరగలేదు
సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిర్ధారించిన పోలీసులు, ఆస్పత్రి అధికారులు